Ben Stokes: కౌంటీ మ్యాచ్ లో స్టోక్స్ విధ్వంసం

ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్ లో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో సిక్సర్ల వర్షం కురిపించాడు.

  • Written By:
  • Publish Date - May 6, 2022 / 10:50 PM IST

ఇంగ్లాండ్ టెస్ట్ టీమ్ కొత్త కెప్టెన్ బెన్ స్టోక్స్ కౌంటీ క్రికెట్ లో దుమ్మురేపాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో సిక్సర్ల వర్షం కురిపించాడు.
ఒక ఓవర్‌లో వరుసగా ఐదు భారీ సిక్సర్లు కొట్టడంతో పాటు 64 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కౌంటీ చాంపియన్‌షిప్‌ లో డర్హమ్‌ తరపున ఆడుతున్న స్టోక్స్‌ వారిస్టర్ షైర్ పై ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు.

ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు కొట్లే అవకాశం తృటిలో చేజార్చుకున్న స్టోక్స్ ప్రత్యర్థి బౌలర్‌కు మాత్రం చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్‌ 117వ ఓవర్‌కు ముందు స్టోక్స్‌ 59 బంతుల్లో 70 పరుగులతో ఆడుతున్నాడు. జోష్‌ బేకర్‌ వేసిన ఆ ఓవర్‌లో తొలి ఐదు బంతులకు ఐదు సిక్సర్లు బాదిన స్టోక్స్‌.. చివరి బంతిని బౌండరీ తరలించి 34 పరుగులు చేశాడు. దీంతో కేవలం 64 బంతుల్లో శతకం అందుకున్నాడు. సెంచరీ పూర్తయిన తర్వాత కూడా స్టోక్స్ విధ్వంసం కొనసాగింది. భారీ షాట్లతో రెచ్చిపోయిన ఈ స్టార్ ఆల్ రౌండర్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 17 సిక్సర్లతో 161 పరుగులు చేసి ఔటయ్యాడు. కేవలం సిక్సర్లు, ఫోర్ల ద్వారానే 134 పరుగులు పరుగులు చేశాడంటే స్టోక్స్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో అర్థం చేసుకోవచ్చు. ఇక రెండోరోజు లంచ్‌ విరామం తర్వాత డర్హమ్‌ 6 వికెట్ల నష్టానికి 580 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

ఇదిలా ఉంటే గతేడాది కాలంగా టెస్టుల్లో ఇంగ్లండ్‌ దారుణ ప్రదర్శన కనబరిచింది. దీంతో వరుస సిరీస్‌ వైఫల్యాలకు బాధ్యత వహిస్తూ జో రూట్‌ కెప్టెన్సీ పదవికి రాజీనామా చేశాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు బెన్‌ స్టోక్స్‌ను కొత్త టెస్టు కెప్టెన్‌గా నియమించింది. వన్డే, టీ ట్వంటీల్లో నిలకడైన ఆల్ రౌండర్ గా పేరున్న స్టోక్స్ టెస్టుల్లో ఇంగ్లాండ్ ను మళ్ళీ విజయాల బాట పట్టిస్తాడని ఈసీబీ భావిస్తోంది.