Site icon HashtagU Telugu

ENG vs WI : ఏందీ మామ ఇదీ.. టెస్టును కాస్త టీ20గా మార్చేశావుగా.. చ‌రిత్ర సృష్టించిన బెన్‌స్టోక్స్‌

Benstokes

Benstokes

ENG vs WI : కోచ్‌గా బ్రెండ‌న్ మెక్‌క‌ల్ల‌మ్‌ (Brendon McCullum), కెప్టెన్‌గా బెన్‌స్టోక్స్ (Ben Stokes) బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఇంగ్లాండ్ టెస్టు క్రికెట్ రూపు రేఖ‌లే మారిపోయాయి. బజ్‌బాల్ (BuzzBallz ) విధానంతో ప్ర‌త్య‌ర్థుల వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్నారు. కొన్ని సార్లు ఈ విధానం వ‌ల్ల ఇబ్బందులు ఎదురైనా కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. త‌మ‌కు అచ్చొచ్చిన బ‌జ్‌బాల్ ఆట‌తోనే ఇంగ్లాండ్ తాజాగా వెస్టిండీస్‌(West Indies) తో జ‌రిగిన మూడు మ్యాచుల టెస్టు సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

ఆఖ‌రిదైన మూడో టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ విశ్వరూపం చూపించాడు. అత‌డి ధాటికి విండీస్ నిర్దేశించిన 82 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 7.2 ఓవ‌ర్ల‌లోనే ఇంగ్లాండ్ జ‌ట్టు ఛేదించింది. కేవ‌లం 28 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 57 ప‌రుగుల‌తో స్టోక్స్ అజేయంగా నిలిచాడు. స్టోక్స్ కేవ‌లం 24 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ అందుకోవ‌డం విశేషం. ఇంగ్లాండ్ త‌రుపున టెస్టుల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచ‌రీ చేసిన ఆట‌గాడిగా స్టోక్స్ చ‌రిత్ర సృష్టించాడు.

ఈ క్ర‌మంలో అత‌డు ఇయాన్ బోథ‌మ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. బోథ‌మ్ 1981లో ఢిల్లీలో భార‌త్ పై 28 బంతుల్లో అర్థ‌శ‌త‌కం చేశాడు. ఇక 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత వేగంగా హాప్ సెంచ‌రీ చేసిన జాబితాలో జాక్వెస్ క‌లిస్‌తో క‌లిసి స్టోక్స్ మూడో స్థానంలో నిలిచాడు. ఈ జాబితాలో పాకిస్తాన్ మాజీ ఆటగాడు మిస్బా ఉల్ హక్ తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాపై మిస్బా కేవ‌లం 21 బంతుల్లోనే హాఫ్ సెంచ‌రీ చేశాడు.

టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో అత్యంత వేగ‌వంత‌మైన హాఫ్ సెంచ‌రీ చేసిన ప్లేయ‌ర్లు..

మిస్బా ఉల్ హక్ (పాకిస్తాన్) – ఆస్ట్రేలియా పై 21 బంతుల్లో
* డేవిడ్ వార్న‌ర్ (ఆస్ట్రేలియా) – పాకిస్తాన్ పై 23 బంతుల్లో
* జాక్వెస్ క‌లిస్ (ద‌క్షిణాఫ్రికా) – జింబాబ్వే పై 24 బంతుల్లో
* బెన్ స్టోక్స్ (ఇంగ్లాండ్‌) – వెస్టిండీస్ పై 21 బంతుల్లో
* షేన్ షిల్లింగ్‌ఫోర్డ్ (వెస్టిండీస్‌) – న్యూజిలాండ్ పై 25 బంతుల్లో

ఇక వెస్టిండీస్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మూడో టెస్టు మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో మొద‌ట బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 282 ప‌రుగుల‌కు ఆలౌటైంది. అనంత‌రం ఇంగ్లాండ్ మొద‌టి ఇన్నింగ్స్‌లో 376 ప‌రుగులు చేసింది. దీంతో ఇంగ్లాండ్‌కు 94 ప‌రుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ల‌భించింది. ఆ త‌రువాత వెస్టిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో 175 ప‌రుగుల‌కు కుప్ప‌కూలింది. ఇంగ్లాండ్ ముందు 82 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్యం నిలిచింది.

రెగ్యుల‌ర్ ఓపెన‌ర్ జాక్ క్రాలీ చేతి వేలికి గాయం కావ‌డంతో కెప్టెన్ బెన్‌స్టోక్స్ రెండో ఇన్నింగ్స్‌లో ఓపెన‌ర్‌గా వ‌చ్చాడు. అత‌డితో పాట్ మ‌రో ఓపెన‌ర్ బెన్ డ‌కెట్(16 బంతుల్లో 25 నాటౌట్‌) రాణించ‌డంతో స్వ‌ల్ప ల‌క్ష్యాన్ని ఇంగ్లాండ్ 7.2 ఓవ‌ర్ల‌లోనే అందుకుంది.

ALSO READ : Paris Olympics 2024: షూటర్ మను భాకర్‌కు హర్యానా సీఎం శుభాకాంక్షలు