ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ క్రికెట్ బోర్డు తీరుతోనే వన్డేలకు రిటైర్ మెంట్ ప్రకటించినట్టు చెప్పాడు. బిజీ షెడ్యూల్ తో ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత కరువైందని స్టోక్స్ వ్యాఖ్యానించాడు. ఈ ఆల్ రౌండర్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.పరిగెత్తడానికి తాము కార్లు కాదు.. తన వన్డే రిటైర్మెంట్‌తోనైనా మేల్కొంటే మంచిదంటూ ఈసీబీకి పరోక్షంగా చురకలంటించాడు.
బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. తమ బోర్డు తీరుపై కాస్త అసహనం వ్యక్తం చేశాడు. ఈసీబీ ఆటగాళ్లకు కనీస గ్యాప్ లేకుండా బిజీ షెడ్యూల్ ఉండేలా చేసిందనీ, దీనివల్ల ఆటగాళ్లకు మానసిక ప్రశాంతత కరువవుతుందన్నాడు. తన విషయంలో ఇదే జరిగిందనీ, పరిగెత్తడానికి తాము కార్లు కాదన్న స్టోక్స్ ఇక్కడ తాము మనుషులమని గుర్తించాలన్నాడు. తీరిక లేకుండా క్రికెట్ ఆడితే ఎవరైనా అలసిపోతారనీ, ఆ సమయంలో రెస్ట్ అవసరమనీ చెప్పాడు. విశ్రాంతి లేకుండా పరిగెత్తాలంటే ఎవరి తరం కాదన్నాడు. 36 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత వెనుదిరిగి చూసుకుంటే గొప్ప ఇన్నింగ్స్‌లు కనబడాలే తప్ప ఉరుకులు పరుగులు కాదనీ కాస్త ఘాటుగా వ్యాఖ్యనించాడు. తన వన్డే రిటైర్‌మెంట్‌తోనైనా ఈసీబీ మేల్కొంటే మంచిదనీ స్టోక్స్ అభిప్రాయ పడ్డాడు. ఇదిలా ఉంటే భారత్ తో వన్డే సీరీస్ ముగిసిన వెంటనే స్టోక్స్ తన రిటైర్ మెంట్ ప్రకటన చేసాడు. వన్డే రిటైర్‌మెంట్‌కు గల కారణాన్ని స్టోక్స్ ట్విటర్ వేదికగా వెల్లడించాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం చాలా కష్టంగా ఉందనీ , శరీరం సహకరించడం లేదన్నాడు. అదే విధంగా వన్డే ఫార్మాట్లో వంద శాతం న్యాయం చేయలేపోతున్నాననీ చెప్పాడు. ఇకపై తన దృష్టింతా టెస్టు క్రికెట్‌పై పెట్టాలని భావిస్తున్నానంటూ రాసుకొచ్చాడు. కాగా స్టోక్స్ తాజాగా చేసిన వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలయింది.
Ben Stokes @ ECB: మేము కార్లు కాదు…మనుషులం.. ఈసిబీ పై స్టోక్స్ సంచలన వ్యాఖ్యలు

Ben Stokes