Beijing 2022: వింటర్ ఒలింపిక్స్ కు వేళాయె

శరీరం గడ్డకట్టిపోయేలా ఉండే చలి... అయితేనేం పతకాల వేటలో అదేమీ వారికి అడ్డంకి కాదు.

  • Written By:
  • Publish Date - February 4, 2022 / 02:06 PM IST

శరీరం గడ్డకట్టిపోయేలా ఉండే చలి… అయితేనేం పతకాల వేటలో అదేమీ వారికి అడ్డంకి కాదు. మంచుపై సర్రున దూసుకుపోతూ స్కీయర్లు, స్కేటర్లకు తోడు… ఐస్ పై ఆడే హాకీతో మెడల్ గెలిచేందుకు పోరాటాలు.. ఇవీ వింటర్ ఒలింపిక్స్ లో కనిపించే దృశ్యాలు. మంచు లోయల్లో జరిగే క్రీడోత్సవానికి మళ్ళీ సమయం వచ్చేసింది. బీజింగ్ వేదికగా శుక్రవారం వింటర్ ఒలింపిక్స్ ప్రారంభం కాబోతున్నాయి. 15 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో 90 దేశాల నుండి 3 వేల మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. 7 క్రీడల్లో మొత్తం 109 విభాగాల్లో పోటీలు జరగనున్నాయి. ఈ పోటీల కోసం బీజింగ్, యాన్ కింగ్, జాంగ్జియా నగరాల్లోని 13 వేదికలు ముస్తాబయ్యాయి. శుక్రవారం బీజింగ్ నేషనల్ స్టేడియం వేదికగా ప్రారంభోత్సవం జరగనుంది. ఇప్పటికే స్కై జంపింగ్ , ఐస్ హాకీ, లూజ్ , కర్లింగ్ వంటి వాటిలో పోటీలు మొదలయ్యాయి. శనివారం నుండి పతకాల
ఈవెంట్లు మొదలుకాబోతున్నాయి. కాగా కోవిడ్ నేపథ్యంలో పలు ఆంక్షల మధ్య వింటర్ ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారు. విదేశీ ప్రేక్షకులకు అనుమతి లేదు. అలాగే స్పోర్ట్స్ విలేజ్ లో అథ్లెట్లు , అధికారులకు ప్రతీరోజూ కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే ఈ మెగా ఈవెంట్ లో భారత్ నుండి ఒకే ఒక్క అథ్లెట్ పోటీపడుతున్నాడు. జమ్మూకాశ్మీర్ కు చెందిన ఆరిఫ్ ఖాన్ స్కీయింగ్ కు అర్హత సాధించాడు. ఇప్పటి వరకూ శివకేశవన్ మాత్రమే అత్యధికంగా ఆరుసార్లు పోటీపడిన భారత అథ్లెట్ గా రికార్డులకెక్కాడు. కాగా 1964 నుండీ వింటర్ ఒలింపిక్స్ లో పోటీపడుతున్న భారత్ ఇప్పటివరకూ ఒక్కసారి కూడా పతకం గెలవలేకపోయింది.