Site icon HashtagU Telugu

Rohit Sharma: ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణ‌యం ఏంటీ!

Team India

Team India

Rohit Sharma: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల‌ భవిష్యత్తుపై నిత్యం ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ శ‌ర్మ‌ (Rohit Sharma) తన కెరీర్‌కు సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చని వార్త‌లు వ‌స్తున్నాయి. రోహిత్ భ‌విష్య‌త్తుకు సంబంధించి ఓ అప్‌డేట్ బయటకు వచ్చింది. దీని ప్రకారం.. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్‌కు ఉన్న ప్రణాళికలు ఏమిటో స్పష్టం చేయాలని బీసీసీఐ కోరిన‌ట్లు తెలుస్తోంది.

ఓ నివేదిక ప్ర‌కారం.. సెలెక్టర్లు 2027 వన్డే ప్రపంచ కప్, టెస్ట్ క్రికెట్ కోసం ఇప్ప‌టినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలనుకుంటున్నారు. ఈ కారణంగా భవిష్యత్ ప్రణాళికపై చర్చించాల్సిందిగా రోహిత్‌ను బీసీసీఐ కోరినట్లు సమాచారం. గత సమావేశంలో సెలెక్టర్లు, బోర్డు అధికారులు రోహిత్ శర్మతో ఈ విషయమై చర్చించారు. ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత తన భవిష్యత్తు ప్రణాళికలను నిర్ణయించుకోవాలని అతనికి స్పష్టంగా చెప్పారు. తదుపరి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) సైకిల్, ODI ప్రపంచ కప్ కోసం జట్టు మేనేజ్‌మెంట్ కొన్ని ప్రత్యేక ప్రణాళికలను కలిగి ఉంది. మార్పు ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని, అందరూ అదే బాటలో పయనించాలని రోహిత్‌కు బోర్డు సూచించిన‌ట్లు బీసీసీఐ అధికారి ఒక‌రు పేర్కొన్నారు.

కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై చర్చ

జనవరి 11న ముంబైలో భారత జట్టు ప్రదర్శనపై సమీక్షా సమావేశం జరిగింది. ఆ తర్వాత రోహిత్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. అభిషేక్ త్రిపాఠి నివేదిక ప్రకారం.. సమీక్ష సమావేశంలో BCCI అధికారులు కెప్టెన్ రోహిత్ శర్మ, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌లను ప్రశ్నలు అడిగారు. ఈ సమయంలో రోహిత్ శర్మ తదుపరి కెప్టెన్‌ను ఎంచుకున్న‌ తర్వాత తాను టీమ్ ఇండియా కెప్టెన్సీ నుండి తప్పుకుంటానని స్పష్టం చేసినట్లు నివేదికలో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను కొంత‌కాలం టీమ్ ఇండియాకు కెప్టెన్‌గా ఉండాలని కోరుకుంటున్నట్లు రోహిత్ చెప్పినట్లు పేర్కొన్నారు. కొత్త కెప్టెన్‌గా బోర్డు ఎవరిని ఎంపిక చేసినా తాను పూర్తిగా మద్దతిస్తానని రోహిత్ చెప్పాడు. ఇప్ప‌టినుంచే కొత్త కెప్టెన్ కోసం బోర్డు వెతుకుతూనే ఉండాల్సి ఉంటుంది.

Also Read: David Miller: టీ20ల్లో సౌతాఫ్రికా త‌ర‌పున చ‌రిత్ర సృష్టించిన డేవిడ్ మిల్ల‌ర్‌!

అయితే ప‌లువురి పేర్ల‌ను కెప్టెన్‌గా పరిశీలిస్తున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియాకు నివేదిక తెలిపింది. టెస్టు కెప్టెన్సీ విషయంలో జస్ప్రీత్ బుమ్రా పేరు ముందు వరుసలో ఉంది. అయితే బుమ్రా ఫిట్‌నెస్‌ను దృష్టిలో ఉంచుకుని ఎవ‌రైనా యువ ఆటగాడికి ఈ బాధ్యతను అప్పగించాలని సెలక్టర్లు ఆలోచిస్తున్నారు. శుభ్‌మన్ గిల్ పేరును కూడా పరిశీలిస్తున్నారు. అయితే టెస్టు క్రికెట్‌లో అతని ఫామ్ నిరాశ‌ప‌రుస్తోంది. ఇలాంటి పరిస్థితిలో మీడియా నివేదికల ప్రకారం.. రిషబ్ పంత్, యశస్వి జైస్వాల్‌లకు ఈ బాధ్యతను ఇవ్వ‌నున్న‌ట్లు కూడా వార్త‌లు వ‌స్తున్నాయి.

కోహ్లీపై కూడా త్వ‌ర‌లోనే నిర్ణ‌యం

టీమిండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ విష‌యంలో బీసీసీఐ ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి నిర్ణ‌యం తీసుకోలేద‌ని తెలుస్తోంది. కోహ్లీ సేవ‌ల‌ను జ‌ట్టు వినియోగించుకోవాల‌ని చూస్తోంది. అయితే కోహ్లీ ప్ర‌స్తుతం ఫామ్ లేక ఇబ్బందిప‌డుతున్నాడు. కోహ్లీ వ‌న్డేల్లో రాణించినా.. టెస్టుల్లో నిరాశ‌ప‌రుస్తున్నాడు. కోహ్లీ టెస్ట్ ఫామ్‌పై బీసీసీఐ అధికారులు కాస్త సమయం తీసుకుని నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది.