BCCI Unhappy: భారత్ క్రికెటర్ల పై బీసీసీఐ ఆగ్రహం

ఇంగ్లాండ్ టూర్ లో భారత ఆటగాళ్ళ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - June 27, 2022 / 09:05 AM IST

ఇంగ్లాండ్ టూర్ లో భారత ఆటగాళ్ళ తీరుపై బీసీసీఐ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కోవిడ్ నిబంధనలు పాటించాలని ఆదేశించినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఓ టెస్ట్‌, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం కొద్దిరోజుల కిందట టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లండ్ చేరుకున్నారు. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా సభ్యులు జోరుగా షికారు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నాలుగు రోజుల కిందట రోహిత్‌, కోహ్లి షాపింగ్‌ అంటూ లండన్‌ వీధుల్లో చక్కర్లు కొడుతూ ఫోటోలకు పోజులు కూడా ఇచ్చారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో రోహిత్‌, కోహ్లి మాస్కులు లేకుండా వీధుల్లో తిరగడాన్ని బీసీసీఐ సీరియస్‌గా తీసుకుంది. ఇదే విషయంపై ముందే వార్నింగ్ కూడా ఇచ్చింది. తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ కరోనా బారిన పడడంతో మరోసారి భారత్ క్రికెటర్ల నిర్లక్ష్యంపై బీసీసీఐ సీరియస్ అయినట్టు సమాచారం.యూకేలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అక్కడ ఇప్పటికీ రోజుకు 10వేలకు పైగా కేసులు నమోదు అవుతున్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో కనీస జాగ్రతలు తీసుకోకుండా షాపింగ్ అంటూ ప్లేయర్స్ బయట తిరగడంపై అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. బాధ్యతగా ఉండాల్సిన కెప్టెన్ , మాజీ కెప్టెన్ లు కూడా మాస్కులు ధరించకుండా షికార్లు చేయడం పై టీమ్ మేనేజ్ మెంట్ కు క్లాస్ తీసుకున్నట్టు బోర్డు వర్గాలు వెల్లడించాయి.టీమిండియా ఆటగాళ్లు కోవిడ్‌ ప్రోటోకాల్స్‌ను పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలని.. లేని పక్షంలో చర్యలు తీసుకునేందుకు ఎంత మాత్రం వెనకాడేది లేదని బీసీసీఐ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ కు పాజిటివ్ గా తేలడంతో టెస్ట్ మ్యాచ్ కు అందుబాటులో ఉండటంపై సస్పెన్స్ నెలకొంది. అలాగే జట్టులోని మిగిలిన ప్లేయర్స్ తో అతను సన్నిహితంగా మెలిగిన నేపద్యంలో ఎవరికయినా సోకిందేమో అన్న టెన్షన్ మొదలయింది. లీస్టర్ షైర్ తో మ్యాచ్ ముగియడంతో కోవిడ్ పరీక్షల ఫలితాలు వచ్చిన తర్వాతే టీమ్ ఇండియా బర్మింగ్ హామ్ వెళ్లనుంది.