India U19 Team: అండర్-19 ఆసియా కప్ 2025 ఫైనల్‌లో పాకిస్థాన్ చేతిలో భారత్ ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ 191 పరుగుల భారీ తేడాతో భారత జట్టును ఓడించింది. టోర్నీ అంతటా అద్భుత ప్రదర్శన చేసిన టీమ్ ఇండియా.. ఫైనల్‌లో మాత్రం చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ సహా జట్టు సభ్యులపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.
టీమ్ ఇండియా ప్రదర్శనపై బీసీసీఐ సమీక్ష
క్రికబజ్ నివేదిక ప్రకారం.. ఈ ఓటమిపై బీసీసీఐ తీవ్ర అసంతృప్తితో ఉంది. డిసెంబర్ 22న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జూనియర్ టీమ్ ప్రదర్శనపై చర్చించాలని నిర్ణయించారు. దీనిపై మేనేజ్‌మెంట్‌ను వివరణ కోరనున్నారు. టీమ్ మేనేజర్ సలిల్ దతార్ నుంచి నివేదిక అందనుంది. అలాగే హెడ్ కోచ్ రిషికేశ్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రేలతో కూడా బీసీసీఐ చర్చలు జరపాలని యోచిస్తోంది.
Also Read: ట్రంప్ నువ్వు మారవా ? మళ్లీ అదే మాట!
సాధారణంగా జరిగే సమీక్షా ప్రక్రియ కంటే ఇది భిన్నంగా ఉండబోతోంది. ఫైనల్ మ్యాచ్ సమయంలో ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు కూడా తెరపైకి వచ్చాయి. అయితే దీనిపై బీసీసీఐ స్పందిస్తుందో లేదో ఇంకా స్పష్టత లేదు. 2026 జనవరి-ఫిబ్రవరిలో అండర్-19 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో అప్పటికల్లా లోపాలను సరిదిద్ది జట్టును బలోపేతం చేయాలని బీసీసీఐ భావిస్తోంది. ముఖ్యంగా ఫైనల్‌లో బ్యాటింగ్ వైఫల్యంపై ప్రధానంగా చర్చ జరగనుంది.
ఫైనల్‌లో టీమ్ ఇండియా ఎలా ఓడిపోయింది?
అండర్-19 ఆసియా కప్ ఫైనల్ వరకు టీమ్ ఇండియా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా దూసుకొచ్చింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో అదరగొట్టింది. అయితే ఫైనల్‌లో మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 347 పరుగుల భారీ స్కోరు సాధించింది. షామీర్ మిన్హాస్ 172 పరుగులతో వీరవిహారం చేశాడు. బారీ లక్ష్యమైనప్పటికీ భారత బ్యాటింగ్ బలం చూస్తే విజయం సాధిస్తుందని అందరూ భావించారు. కానీ భారత జట్టు కేవలం 156 పరుగులకే ఆలౌట్ అయింది. ఫలితంగా 191 పరుగుల తేడాతో పాక్ విజయం సాధించింది. అండర్-19 వరల్డ్ కప్‌లో ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ఉండాలని టీమ్ ఇండియా లక్ష్యంగా పెట్టుకుంది.
