Rs 3.5 Cr Charter Plane Trip:టీమిండియా స్పెషల్ ఫ్లైట్.. ఖర్చెంతో తెలుసా ?

లండన్ టూ కరేబియన్ దీవులు... ఫ్లైట్ ఖర్ఛు అక్షరాలా 3.5 కోట్లు...మీరు వింటున్నది నిజమే.. భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ వెచ్చించిన మొత్తం ఇది..

  • Written By:
  • Publish Date - July 21, 2022 / 03:52 PM IST

లండన్ టూ కరేబియన్ దీవులు… ఫ్లైట్ ఖర్ఛు అక్షరాలా 3.5 కోట్లు…మీరు వింటున్నది నిజమే.. భారత క్రికెటర్ల కోసం బీసీసీఐ వెచ్చించిన మొత్తం ఇది.. ఎందుకు ఇంత ఖర్చు చేయాల్సి వచ్చింది… ప్రపంచ క్రికెట్‌లో అత్యంత ధనిక బోర్డు ఏదంటే బీసీసీఐ అనడంలో మరో సందేహమే లేదు. ఏ ఒప్పందమైనా కోట్లలోనే ఉంటుంది.. ఐపీఎల్ ప్రసార హక్కుల డీల్ అయినా… టీమిండియా జెర్సీ స్పాన్సర్‌షిప్ అయినా బీసీసీఐకి కాసుల వర్షమే. ఈ స్థాయిలో ఆర్జించే భారత క్రికెట్ బోర్డు ఆటగాళ్ళ కోసం కూడా ఆ స్థాయిలో వెచ్చిస్తుంటుంది.

వారి విదేశీ, స్వదేశీ పర్యటనల కోసం ప్రత్యేక ఫ్లైట్‌లు , లగ్జరీ హోటల్స్‌లో ఆతిథ్యం ఇలా ఏ విషయంలోనూ రాజీ పడే ప్రసక్తే లేదు. తాజాగా టీమిండియా విండీస్ పర్యటనకు సంబంధించి తాజాగా ఓ ఆసక్తికర వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఇంగ్లాండ్ టూర్ నుంచి భారత జట్టు నేరుగా కరేబియన్ పర్యటనకు వెళ్ళిపోయింది. అయితే వీరి ట్రావెలింగ్ కోసం బీసీసీఐ చేసిన ఖర్చు చూస్తే దిమ్మతిరగాల్సిందే. లండన్ నుంచి కరేబియన్ దీవులు వెళ్ళేందుకు బీసీసీఐ ఏర్పాటు చేసిన స్పెషల్ కమర్షియల్ ఫ్లైట్‌ కోసం అక్షరాలా 3.5 కోట్ల రూపాయలు వెచ్చించింది. కోవిడ్ ప్రభావం తగ్గినా ఇంత భారీ ఖర్చుతో స్పెషల్ ఫ్లైట్ ఏర్పాటు చేయడానికి పెద్ద కారణమే ఉంది. అదేమిటంటే విండీస్‌కు వెళ్ళేందుకు టిక్కెట్లు దొరక్కపోవడమే దీనికి కారణం. ఒకేసారి ఆటగాళ్ళు, సహాయక సిబ్బంది , ఇతర అధికారులు వెళ్ళేందుకు చాలినన్ని టిక్కెట్లు అందుబాటులో లేకపోవడంతో చివరి నిమిషంలో బీసీసీఐ ప్రత్యేక విమానం ఏర్పాటు చేయక తప్పలేదు.

ఆటగాళ్ళు, ఇతర సిబ్బంది బిజినెస్ క్లాస్‌ లో రెగ్యులర్ ఫ్లైట్స్‌లో వెళ్ళి ఉంటే కోటిన్నర వరకూ వరకూ ఖర్చయ్యే అవకాశముండగా…టిక్కెట్లు లేకపోవడంతో స్పెషల్ ఫ్లైట్ తీసుకున్నట్టు బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించాడు. చార్టర్డ్ ఫ్లైట్ కోసం అదనంగా మరో 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందని తెలిపాడు. ఈ స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్‌లో భారత ఆటగాళ్లతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా వెళ్లారు. ప్రత్యేక విమానానికి 3.5 కోట్లు ఖర్చు పెట్టడంపై సోషల్ మీడియా వేదికగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎంత రిచ్‌ క్రికెట్‌ బోర్డ్‌ అయినా మరీ ఇంత ఖర్చు పెట్టడం అవసరమా అంటూ కొంతమంది వ్యాఖ్యానిస్తుంటే…బీసీసీఐకి ఈ మొత్తం పెద్ద లెక్క కాదని, పెట్టిన పెట్టుబడికి మూడింతలు సంపాదిస్తోందని అంటున్నారు. ఏదేమైనా మిగిలిన క్రికెట్ బోర్డులతో పోలిస్తే బీసీసీఐ ఎప్పుడూ ప్రత్యేకమేనని అర్థమవుతోంది. కాగా విండీస్ టూర్‌లో భారత జట్టు మూడు వన్డేలు, ఐదు టీ ట్వంటీలు ఆడనుంది.