BCCI: టార్గెట్ వన్డే వరల్డ్ కప్…20 మంది షార్ట్ లిస్ట్

టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిపై ద్రావిడ్ , లక్ష్మణ్ వివరణలు విన్న తర్వాత రోజర్ బిన్నీ, చేతన్ శర్మ పలు కీలక సూచనలు చేశారు.

  • Written By:
  • Publish Date - January 1, 2023 / 09:04 PM IST

గత ఏడాది టీమిండియాకు (Team India) ఈ మాత్రం కలిసి రాలేదు. ద్వైపాక్షిక సీరీస్ లలో అదరగొట్టినా ఐసీసీ టోర్నీల్లో నిరాశ పరిచింది. ఆసియా కప్, టీ ట్వంటీ వరల్డ్ కప్ లో అంచనాలు అందుకోలేక పోయింది. దీంతో కొత్త ఏడాదిలో వన్డే ప్రపంచ కప్ టార్గెట్ గా జట్టును సన్నద్ధం చేయాలని బీసీసీఐ (BCCI) నిర్ణయించింది. దీనిలో భాగంగా త్వరలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఐపీఎల్ ఆడే విషయంలో కూడా కీలక ఆటగాళ్ళపై కొన్ని ఆంక్షలు విధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబయిలో జరిగిన బీసీసీఐ పర్ఫార్మెన్స్ రివ్యూ మీటింగ్‌లో దీనిపై చర్చించారు. ఈ సమావేశానికి కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, ఎన్‌సీఏ ఛైర్మన్ వీవీఎస్ లక్ష్మణ్, మాజీ ఛీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ హాజరయ్యారు. బీసీసీఐ ఛైర్మన్ రోజర్ బిన్నీ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

టీ ట్వంటీ వరల్డ్ కప్ వైఫల్యం ప్రధానంగా చర్చకు వచ్చింది. దీనిపై ద్రావిడ్ , లక్ష్మణ్ వివరణలు విన్న తర్వాత రోజర్ బిన్నీ, చేతన్ శర్మ పలు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా స్వదేశంలో జరగనున్న వన్డే ప్రపంచకప్‌లో సత్తా చాటేందుకు గానూ 20 మంది ప్లేయర్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అలాగే కొన్ని కీలక మార్పులను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. అగ్రశ్రేణి ఆటగాళ్లను ఫామ్ లేమి, గాయం సమస్యలను తగ్గించేందుకు వచ్చే ఐపీఎల్ ఎడిషన్‌ ఆడడంపై వారికి కొన్ని సూచనలు చేయాలని నిర్ణయించింది. ఐపీఎల్ కంటే కూడా ఐసీసీ ఈవెంట్లపైనే దృష్టి సారించాలని సీనియర్ ప్లేయర్స్ ను కోరుతోంది.

ఇదిలా ఉంటే యువ ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఎంపిక కావడానికి ఎక్కువ దేశవాళీ మ్యాచ్‌లను ఆడాల్సి ఉంటుంది. ఇక ఆటగాళ్ల ఫిట్ నెస్ విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని బోర్డు నిర్ణయించింది. సెలక్షన్ ప్రక్రియలో భాగంగా యోయో టెస్టు, డెక్సా ప్రమాణాలు ఉంటాయి. అంతేకాకుండా సెంట్రల్ పూల్ ఆఫ్ ప్లేయర్లకు అనుకూలంగా రోడ్ మ్యాప్ అమలుచేస్తారు. అంతర్జాతీయ షెడ్యూల్ దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ ఆడాలనకుంటున్న ఆటగాళ్లను పర్యవేక్షించడానికి ఎన్‌సీఏ ఐపీఎల్ ఫ్రాంఛైజీతో కలిసి పనిచేస్తుంది.