Team India @England: కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కడ ?

ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు.

  • Written By:
  • Publish Date - June 16, 2022 / 12:57 PM IST

ఇంగ్లాండ్ టూర్ కోసం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. విరాట్‌ కోహ్లీ, కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, ఛెతేశ్వర్‌ పుజారా, సిరాజ్, షమీ, జడేజా, శుబ్ మన్ గిల్, హనుమ విహారి లండన్‌ బయల్దేరిన వారిలో ఉన్నారు. వీరంతా విమానంలో ఉన్న ఫోటోలను బీసీసీఐ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అభిమానులతో పంచుకుంది. అయితే ఒక్క ఫోటోలో కూడా రోహిత్ శర్మ లేకపోవడం ఆశ్చర్య పరిచింది. దీంతో ఫాన్స్ అంతా రోహిత్ ఎక్కడ , కెప్టెన్ ఎక్కడ అంటూ బీసీసీఐకి ట్వీట్టర్ లో ప్రశ్నల వర్షం కురిపించారు. పుజారా , బూమ్రా పోస్ట్ చేసిన వేరే ఫోటోల్లో కూడా రోహిత్ శర్మ లేడు. రోహిత్ బయలుదేరిన విషయం పై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ ఒక్క ఫోటోలో కూడా అతను లేకపోవడంతో విమర్శలు ఎదుర్కొంది. దక్షిణాఫ్రికాతో టీ 20 సిరీస్ ముగిసిన తర్వాత జట్టులోని ఇతర ఆటగాళ్లు, హెడ్‌ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇంగ్లండ్‌కు బయలుదేరనున్నారు.

గతేడాది అర్ధాంతరంగా వాయిదా పడిన చివరి టెస్ట్‌ మ్యాచ్‌ జులై 1 న ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా జరగనుంది. 5 మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో ప్రస్తుతం భారత్‌ 2-1 ఆధిక్యంలో ఉంది. దీంతో ఈ మ్యాచ్‌ను డ్రాగా ముగించినా అంతర్జాతీయ టెస్ట్‌ క్రికెట్‌లో మరో అద్భుత సీరీస్ విజయం భారత జట్టు ఖాతాలో చేరనుంది. కాగా ఈ టెస్టుకు ముందు ఎడ్జ్‌బాస్టన్‌లో ఓ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ కూడా ఆడనుంది. అనంతరం మూడు టీ ట్వంటీ లతో పాటు మూడు వన్డేల సిరీస్ లోనూ భారత్ ఇంగ్లీష్ టీమ్ తలపడనున్నాయి.

ఇదిలా ఉంటే కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా టీమిండియా కోసం బీసీసీఐ ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేసింది. అయితే ఇప్పుడు కరోనా పరిస్థితి అదుపులోకి రావడంతో అందరితో పాటు కమర్షియల్ ఫ్లైట్స్ లోనే లండన్ బయలుదేరి వెళ్ళారు. స్వదేశంలో రెండుసార్లు నిర్వహించిన కరోనా ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెగెటివ్ వచ్చిన వారిని బీసీసీఐ ఇంగ్లాండ్ టూర్ కు అనుమతించింది.