BCCI: బీసీసీఐ (BCCI) అధ్యక్షుడు రోజర్ బిన్నీ తన పదవికి రాజీనామా చేసినట్లు ఒక మీడియా నివేదిక వెల్లడించింది. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేంత వరకు ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లా తాత్కాలిక బీసీసీఐ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఓ జాతీయ మీడియా కథనం ప్రకారం.. బుధవారం బీసీసీఐ ఉన్నత స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాజీవ్ శుక్లా అధ్యక్షత వహించారు. ఈ భేటీలో ప్రధానంగా స్పాన్సర్‌షిప్‌కు సంబంధించిన అంశాలపై చర్చించారు. డ్రీమ్11తో ఒప్పందం ముగియడం, తదుపరి రెండు లేదా రెండున్నర సంవత్సరాల కోసం కొత్త స్పాన్సర్‌ను వెతకడంపై చర్చలు జరిగాయి.
ఆ నివేదిక ప్రకారం.. ఆసియా కప్‌కు కేవలం రెండు వారాల సమయం మాత్రమే మిగిలి ఉన్నందున అంత తక్కువ వ్యవధిలో కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం కష్టం. “ఇక రెండు వారాలు కూడా మిగిలి లేవు. మేము ప్రయత్నిస్తున్నాం. కానీ కొత్త టెండర్ జారీ చేయడం, చట్టపరమైన ప్రక్రియలను పాటించడం, మిగిలిన సాంకేతిక పనులకు సమయం పడుతుంది” అని ఒక అధికారి తెలిపారు. కేవలం ఆసియా కప్ కోసం తాత్కాలిక స్పాన్సర్‌ను తీసుకువస్తారా అన్న ప్రశ్నకుతాము అలా చేయబోమని, తమ ప్రధాన లక్ష్యం 2027 వన్డే ప్రపంచ కప్ వరకు స్పాన్సర్‌ను తీసుకురావడమని ఆ అధికారి పేర్కొన్నారు.
Also Read: Megastar Chiranjeevi: అభిమాని పట్ల అపారమైన ప్రేమ చూపిన మెగాస్టార్ చిరంజీవి!
కొత్త ఎన్నికలు అనివార్యం
రాజీవ్ శుక్లా కొత్త బీసీసీఐ అధ్యక్షుడు ఎన్నికయ్యే వరకు తాత్కాలిక నాయకుడిగా కొనసాగుతారు. దేశంలో జాతీయ క్రీడా పరిపాలన చట్టం వచ్చినా ఇంకా దాని నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీనికి కొన్ని నెలల సమయం పట్టవచ్చని భావిస్తున్నారు. అందువల్ల బీసీసీఐ తమ ఎన్నికలను వాయిదా వేయకూడదని నిర్ణయించుకుంది.
ప్రస్తుతానికి.. బీసీసీఐ పరిపాలన లోధా కమిటీ సిఫార్సుల ఆధారంగా సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రూపొందించిన రాజ్యాంగం ప్రకారం నడుస్తుంది. పార్లమెంటు ఆమోదించిన కొత్త క్రీడా చట్టం నోటిఫై అయ్యే వరకు బీసీసీఐ, రాష్ట్ర క్రికెట్ సంఘాలు అదే రాజ్యాంగాన్ని పాటించాల్సి ఉంటుంది. దాని ప్రకారం.. 70 సంవత్సరాల వయస్సు దాటిన తర్వాత ఏ అధికారీ పదవిలో కొనసాగడానికి వీలు లేదు. కొత్త చట్టం నోటిఫై అయితే ఈ వయసు పరిమితి ఉండదు.