Women IPL 2023: మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ ధర ఎంతో తెలుసా.. ?

ఐపీఎల్ అంటేనే బీసీసీఐకి బంగారు బాతు.. లీగ్ ఆరంభమైనప్పటి నుంచీ కోట్లాది రూపాయలు ఆర్జించింది.

  • Written By:
  • Updated On - November 30, 2022 / 08:29 AM IST

ఐపీఎల్ అంటేనే బీసీసీఐకి బంగారు బాతు.. లీగ్ ఆరంభమైనప్పటి నుంచీ కోట్లాది రూపాయలు ఆర్జించింది. ఇప్పుడు మహిళల ఐపీఎల్ ద్వారానూ కోట్లాది రూపాయలు వెనకేయబోతోంది. అధికారికంగా ఇంకా ప్రకటించకున్నా వచ్చే ఏడాది మహిళల ఐపీఎల్ తొలి సీజన్ జరగనుంది. దీనికి సంబంధించి గత కొంతకాలం నుంచీ గ్రౌండ్ వర్క్ చేస్తున్న బోర్డు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళుతోంది. లీగ్ ఏర్పాటులో మొదటి అంకంగా భావిస్తున్న ఫ్రాంచైజీల అమ్మకంపై దృష్టి సారించింది. దీనిలో భాగంగా ఒక్కో ఫ్రాంచైజీని భారీ ధరకు అమ్మబోతోంది. 2008లో తొలి ఐపీఎల్‌ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఫ్రాంచైజీ కనీస ధర రూ.400 కోట్లుగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.

మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని పక్కా ప్లానింగ్ తో వెళుతోంది. మహిళల ఐపీఎల్ లో ఒక్కో ఫ్రాంచైజీ ద్వారా కనీసం 1000 కోట్ల చొప్పున ఆర్జించాలని టార్గెట్ గా పెట్టుకుంది. దీని ప్రకారం చూస్తే మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీల అమ్మకంగా ద్వారానే కనీసం 6 నుంచి 8 వేల కోట్లు వచ్చే అవకాశముంది. ప్రస్తుతం పురుషుల ఐపీఎల్ లో జట్లను కొనుగోలు చేసిన ముంబై, చెన్నై , బెంగళూరు, రాజస్థాన్ యాజమాన్యాలతో పాటు కొన్ని బడా కార్పొరేట్ కంపెనీలు మహిళల ఐపీఎల్ జట్లను కొనేందుకు ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల ఐపీఎల్ ద్వారానూ బోర్డుకు భారీ ఆదాయం రానుంది. కొత్త జట్ల ఎంపికకు టెండర్ల ప్రక్రియను త్వరలోనే ప్రారంభించే అవకాశముంది. ఏ కంపెనీ ఎక్కువగా కోట్ చేస్తే వారికి ఫ్రాంచైజీ అమ్మనుంది.