IPL 2025: ఐపీఎల్-2025లో మ్యాచ్‌లు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. అయితే, ఈ టోర్నీలో విశాఖపట్టణం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ జట్టు 209 పరుగులు చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 19.3 ఓవర్లలో 211 పరుగులు చేసి విజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో చివరి వరకు లక్నో సూపర్ జెయింట్స్ జట్టు విజేతగా నిలుస్తుందని అందరూ భావించారు. కానీ, అశుతోష్ శర్మ ( 66 నాటౌట్) సూపర్ బ్యాటింగ్‌తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. ఈ మ్యాచ్ చివరిలో గెలిచేఅవకాశాలను లక్నో జట్టు చేజార్చుకుంది. రిషబ్ పంత్ రెండుసార్లు ఔట్ చేసే అవకాశం వచ్చినా మిస్ చేయడంతో ఢిల్లీ జట్టు విజేతగా నిలిచింది.
Read Also : Hyderabad: ఐపీఎల్ మ్యాచ్‌లు.. ఉప్పల్ స్టేడియానికి ప్రత్యేక బస్సులు
లక్నో జట్టు ఓటమితో ఆ జట్టు యాజమాని సంజీవ్ గోయెంకా బౌండరీ లైన్‌వద్దకు వచ్చి కెప్టెన్ రిషబ్ పంత్‌పై సీరియస్ అయినట్లు ఫొటోలు వైరల్ అవుతున్నాయి. గతంలోనూ గోయెంకా కేఎల్ రాహుల్‌పై సీరియస్ అయ్యారు. దీంతో క్రికెట్ అభిమానులు ఆయన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం కేఎల్ రాహుల్ లక్నో జట్టు కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే, రాహుల్ కెప్టెన్సీ, జట్టు ఓటమిపై గోయెంకా సీరియస్ అయినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అయ్యాయి. రాహుల్ మధ్యలో ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తూనే ఉన్నప్పటికీ గోయెంకా అతని పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వీడియోలో కనిపించింది. ఈ వీడియో తర్వాత క్రికెట్ అభిమానులు గోయెంకా ప్రవర్తనను తప్పుబట్టారు.
Read Also : ICC T20 Rankings: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. టాప్-5లో ఒక భారతీయుడు మాత్రమే!
లక్నో సూపర్ జెయింట్స్ తమ ఐపీఎల్ జర్నీని 2022 నుండి ప్రారంభించింది. మొదటి ఎడిషన్‌లో ఆ జట్టు కేఎల్ రాహుల్‌ను కెప్టెన్‌గా చేసింది. తొలి రెండు సీజన్లలో రాహుల్ జట్టును ఎలిమినేటర్ రౌండ్‌కు నడిపించాడు. కానీ, గత సంవత్సరం (2024) ఆ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించింది. ఆ సీజన్‌లో ఓ మ్యాచ్‌లో ఓటమి అనంతరం గోయెంకా మైదానం వద్దకు వచ్చి రాహుల్ పై సీరియస్ అయ్యాడు. ఆ ఘటన తరువాత రాహుల్, యాజమాన్యం మధ్య విభేదాలు తలెత్తినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల వేలంలో కేఎల్ రాహుల్‌ను విడుదల చేసి లక్నో యాజమాన్యం.. రిషబ్ పంత్‌ను రికార్డు ధరతో వేలంతో దక్కించుకుంది. ప్రస్తుత సీజన్ కు పంత్ కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. అయితే, అప్పుడు రాహుల్, ఇప్పుడు పంత్ పట్ల గోయెంకా దురుసుగా ప్రవర్తించడంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. బీసీసీఐ గోయెంకా పై చర్యలు తీసుకోలేదా..? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
ఐపీఎల్ ఫ్రాంచైజీ యజమానులకు అనేక నియమాలు ఉన్నాయి. వాటిని అతిక్రమిస్తే బీసీసీఐకు చర్యలు తీసుకునే హక్కు ఉంటుంది. అయితే, జట్టు యజమానులు ఆటగాళ్లతో ఎలా ప్రవర్తించాలి అనే దానిపై స్పష్టమైన నిబంధనలు లేవు. కోట్లు ఖర్చు పెడుతున్న సమయంలో జట్టు పేలవమైన ప్రదర్శన లేదా ఓటమి జట్టు యజమానులను బాధపెట్టవచ్చు. కానీ, మ్యాచ్ తర్వాత ఆటగాళ్ల పట్ల దురుసుగా ప్రవర్తించడం ఏమాత్రం సరికాదు. నాలుగు గోడల మధ్య ఆటగాళ్ల ఆటతీరుపై చర్చించే అవకాశం ఉన్నప్పటికీ.. బహిరంగ ప్రదేశంలో మైదానం వద్ద ఆటగాళ్లపై సీరియస్ అయ్యే హక్కు జట్ల యాజమానులకు లేదన్నది క్రికెట్ అభిమానుల వాదన. అయితే, గత ఏడాది, ప్రస్తుత ఏడాది సీనియర్ ప్లేయర్ల పట్ల సంజీవ్ గోయెంకా ప్రవర్తన పట్ల బీసీసీఐ చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.