Bcci Central Contracts: అయ్యర్, ఇషాన్‌ కిషన్‌లకు షాక్‌… బీసీసీఐ కాంట్రాక్ట్ లిస్ట్ నుంచి ఔట్‌

అనుకున్నదే అయింది... బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ మూల్యం చెల్లించుకున్నారు. ఈ యువక్రికెటర్లు ఇద్దరూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయారు. రంజీల్లో ఆడమని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది.

Bcci Central Contracts: అనుకున్నదే అయింది… బోర్డు ఆదేశాలు ధిక్కరించినందుకు యువక్రికెటర్లు శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్‌ మూల్యం చెల్లించుకున్నారు. ఈ యువక్రికెటర్లు ఇద్దరూ బీసీసీఐ వార్షిక కాంట్రాక్టు కోల్పోయారు. రంజీల్లో ఆడమని చెప్పినా ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో బీసీసీఐ చర్యలు తీసుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా విడుదలైన వార్షిక కాంట్రాక్ట్ జాబితాలో అయ్యర్, ఇషాన్ కిషన్‌లకు చోటు దక్కలేదు. మానసిక ఒత్తిడి సమస్యతో ఇషాన్ కిషన్ , గాయం సాకుతో అయ్యర్ జట్టుకు దూరమయ్యారు. వీరిద్దరూ జాతీయ జట్టులోకి రావాలంటే రంజీలు ఆడాలని కోచ్ ద్రావిడ్‌తో పాటు బీసీసీఐ సెలక్టర్లు చెప్పినా వీరిద్దరూ పట్టించుకోలేదు. ఇషాన్ కిషన్ పలు బర్త్‌డే పార్టీలకు వెళ్లడం కూడా చర్చనీయాంశమైంది. అటు అయ్యర్‌ ఫిట్‌నెస్‌ బాగానే ఉందని ఎన్‌సీఎ రిపోర్ట్ ఇవ్వడంతో బీసీసీఐ సీరియస్ అయ్యింది. అయితే జాబితా ప్రకటించడానికి ఒకరోజు ముందు వీరిద్దరూ దేశవాళీ క్రికెట్‌ ఆడేందుకు సిద్ధమైనప్పటకీ బీసీసీఐ మాత్రం కాంట్రాక్ట్ నుంచి వీరిని తొలగించింది.

ఇదిలా ఉంటే జాతీయ జట్టుకు దూరమైన చటేశ్వర పుజారా, అజంక్య రహానేలకు కూడా కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కలేదు. పుజారా రంజీల్లో పరుగుల వరద పారిస్తున్నా ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు సెలక్టర్లు ఎంపిక చేయలేదు. తాజాగా కాంట్రాక్ట్ కూడా కోల్పోయిన వేళ వీరిద్దరి కెరీర్ ముగిసినట్టేనని చెప్పొచ్చు. కాగా గ్రేడ్ ఏ ప్లస్‌లో నలుగురు ఆటగాళ్ళకు మాత్రమే చోటు దక్కింది. రోహిత్‌శర్మ, కోహ్లీ, బూమ్రా, జడేజా ఏ ప్లస్‌లో ఉన్నారు. గ్రేడ్ ఏలో అశ్విన్, షమీ, సిరాజ్, రాహుల్, గిల్, పాండ్యా ఉన్నారు. గ్రేడ్ బీలో సూర్యకుమార్ యాదవ్, పంత్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, జైశ్వాల్ చోటు దక్కించుకున్నారు. ఇక అక్షదీప్‌, విజయ్ కుమార్ వ్యాసక్, ఉమ్రాన్ మాలిక్, యశ్ దయాల్, విద్వైత్ కరేరప్పలకు ఫాస్ట్ బౌలింగ్ కాంట్రాక్ట్‌లు ఇస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఏ ప్లస్‌ కేటగిరిలో ఉన్న ఆటగాళ్లకు వార్షిక వేతనం కింద యేటా రూ. 7 కోట్లు దక్కనున్నాయి. ‘ఏ’ కేటగిరీలోని క్రికెటర్లకు రూ. 5 కోట్లు..‘బి’ కేటగిరిలో ఉన్న వారికి రూ. 3 కోట్లు.. ‘సి’ కేటగిరిలో ఉన్న క్రికెటర్లకు కోటి రూపాయల వార్షిక వేతనం లభించనుంది.

2023-24 బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితా ః
ఏ ప్లస్‌ కేటగిరి: రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా, రవీంద్ర జడేజా
ఏ కేటగిరి: అశ్విన్‌, షమీ, సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌, శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యా
బి కేటగిరి: సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌, కుల్దీప్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, యశస్వి జైస్వాల్‌
సి కేటగిరి: రింకూ సింగ్‌, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్‌, శార్దూల్ ఠాకూర్‌, శివమ్‌ దూబే, రవి బిష్ణోయ్, జితేష్ శర్మ, వాషింగ్టన్‌ సుందర్, ముఖేష్ కుమార్‌, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్‌, కేఎస్‌ భరత్‌, ప్రసిద్ద్‌ కృష్ణ, అవేష్ ఖాన్‌, రజత్‌ పాటిదార్

Also Read: ICC Test Ranking: టెస్టు ర్యాంకింగ్స్‌లో జైస్వాల్ దూకుడు..