Sourav Ganguly : ఐపీఎల్ వేదికపై గంగూలీ కీలక ప్రకటన

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ముంగిట బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు.

  • Written By:
  • Updated On - February 4, 2022 / 12:47 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆటగాళ్ళ మెగా వేలం ముంగిట బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కీలక ప్రకటన చేశాడు. వచ్చే సీజన్ వేదికపై క్లారిటీ ఇచ్చాడు. ఐపీఎల్ 2022 సీజన్ భారత్ లోనే జరుగుతుందని , లీగ్ మ్యాచ్ లు ముంబై, పుణేలలో జరుగుతాయని చెప్పాడు. అహ్మదాబాద్ ప్లే ఆఫ్స్ కు ఆతిథ్యమిస్తుందని దాదా స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ వేలం ఏర్పాట్లపై బిజీగా ఉన్న గంగూలీ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండడంతో స్వదేశంలోనే సీజన్ నిర్వహించాలని డిసైడ్ అయినట్టు వెల్లడించాడు. నిజానికి విదేశాల్లో నిర్వహించే ఆలోచన ఉన్నప్పటకీ ఫ్రాంచైజీలు దానిని వ్యతిరేకించాయని గంగూలీ వెల్లడించాడు. దీనికి తోడు గత రెండు సీజన్లూ యుఏఈలోనే జరిపామని, ఈ సారి సొంతగడ్డపై నిర్వహించాలనేది ముందు నుండీ అనుకున్నామని గంగూలీ తెలిపాడు.

విదేశాల్లో సీజన్ నిర్వహణపై ఫ్రాంచైజీలు వ్యతిరేకించడంలో చాలా కారణాలున్నాయి. ఖర్చు ఎక్కువగా అవుతుండడమే ప్రధాన కారణంగా చెప్పొచ్చు. ఆటగాళ్ళ విమాన ప్రయాణం, అక్కడి హోటల్ వసతి, ఇతరత్రా ఖర్చులు భారీగా అవుతున్నాయి. గత రెండు సీజన్లలోనూ ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్ లు నిర్వహించడంతో టిక్కెట్ల ఆదాయం పెద్దగా రాలేదు. అలాగే స్పాన్సర్లతో ఒప్పందాల విషయాల్లోనూ ఫ్రాంచైజీలు కొన్ని సమస్యలు ఎదుర్కొన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్వదేశంలోనే సీజన్ జరిపేలా చూడాలని బీసీసీఐకి విజ్ఞప్తి చేశాయి. ఫ్రాంచైజీల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన బీసీసీఐ ముందు నాలుగు నగరాల్లో మ్యాచ్ లు ఉండేలా ప్లాన్ చేసింది. అయితే ప్రస్తుత కోవిడ్ పరిస్థితుల్లో అది అంత సురక్షితం కాదని ఫ్రాంచైజీలు అభిప్రాయపడ్డాయి. దీంతో రెండు రాష్ట్రాలకే పరిమితం చేసేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంది. మహారాష్ట్రలో మూడు స్టేడియాలు ఉండడంతో పాటు పుణేనూ మరో వేదికగా ఖరారు చేసింది. ఇక అహ్మదాబాద్ స్టేడియంలో ప్లే ఆఫ్స్ నిర్వహించనుంది.