Deepak Chahar: అతను గాయపడలేదు… బీసీసీఐ క్లారిటీ

ఆసియా కప్ కు మరో రెండురోజుల్లో తెరలేవనున్న వేళ భారత జట్టు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది

  • Written By:
  • Publish Date - August 25, 2022 / 07:27 PM IST

ఆసియా కప్ కు మరో రెండురోజుల్లో తెరలేవనున్న వేళ భారత జట్టు ప్రాక్టీస్ లో బిజీబిజీగా ఉంది. తొలి మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ తో తలపడబోతోంది. ఇప్పటికే దుబాయ్ చేరుకున్న టీమిండియా నెట్స్ లో శ్రమిస్తోంది. అయితే గురువారం ఓ వార్త అభిమానులను కంగారు పెట్టింది. యువ పేసర్ దీపక్ చాహల్ గాయపడ్డాడని దాని సారాంశం. దీంతో అతని స్థానంలో కుల్దీప్‌ సేన్‌ను స్లాండ్‌ బై ప్లేయర్‌గా తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. మొన్ననే కదా జట్టులోకి వచ్చాడు మళ్ళీ గాయమా అంటూ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.

ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బీసీసీఐ దీపక్ చాహర్ గాయంపై క్లారిటీ ఇచ్చింది. అతను గాయపడలేదని, అవన్నీ తప్పుడు వార్తలనీ, నమ్మొద్దనీ కోరింది. దీపక్‌ చహర్‌ ఆసియా కప్‌లో ఆడుతున్నాడనీ,జట్టుతో పాటు అతను ప్రాక్టీస్‌ కూడా ఆరంభించాడనీ తెలిపింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉందినీ బీసీసీఐ అధికారి వ్యాఖ్యానించారు. ఇక రాజస్తాన్‌ రాయల్స్‌ బౌలర్‌ కుల్దీప్‌ సేన్‌ను నెట్‌బౌలర్‌గానే జట్టులోకి తీసుకున్నట్టు వెల్లడించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన సిరీస్‌లో గాయపడిన దీపక్ చాహార్, ఐపీఎల్ 2022 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. కోలుకోవడానికి చాలా సమయం పట్టడంతో ఆ తర్వాత సౌతాఫ్రికా, ఐర్లాండ్, ఇంగ్లాండ్, వెస్టిండీస్ సిరీస్‌లు కూడా ఆడలేదు. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ సాధించిన దీపక్ చాహర్ జింబాబ్వేతో సరీస్ లో రెండు వన్డేలు ఆడాడు.