BCCI: టీ ట్వంటీ ఫార్మాట్ కు సెపరేట్ కోచ్… బీసీసీఐ ఏమందంటే ?

గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఐపీఎల్ లో చెలరేగిపోయే మన క్రికెటర్లు మెగా టోర్నీల్లో విఫలమవడం చర్చనీయాంశంగా మారింది.

  • Written By:
  • Publish Date - January 2, 2023 / 01:29 PM IST

గత ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ లో భారత జట్టు వైఫల్యం అభిమానులకు తీవ్ర నిరాశ కలిగించింది. ఐపీఎల్ లో చెలరేగిపోయే మన క్రికెటర్లు మెగా టోర్నీల్లో విఫలమవడం చర్చనీయాంశంగా మారింది. అటు బీసీసీఐ కూడా భారత్ అంచనాలను అందుకోలేకపోవడంపై కారణాలను విశ్లేషిస్తోంది. దీనిలో భాగంగానే కోచ్ ద్రావిడ్, తాత్కాలిక కోచ్, ఎన్ సిఎ డైరెక్టర్ లక్ష్మణ్ లతో ప్రత్యేకంగా మాట్లాడింది. ఈ సమావేశానికి ముందు టీ ట్వంటీ ఫార్మేట్ టీమ్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, సెపరేట్ కెప్టెన్ , కోచ్ లను నియమించాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

దీనిపై చర్చించిన బోర్డు పెద్దలు సెపరేట్ కెప్టెన్సీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా.. కోచ్ కు మాత్రం అంగీకరించలేదు. ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్ గా ద్రావిడ్ కొనసాగుతుండగా.. షార్ట్ ఫార్మేట్ కు అతని స్థానంలో మరొకరిని నియమించే అవకాశముందన్న ప్రచారం జరిగింది. అయితే బీసీసీఐ మాత్రం ద్రావిడ్ పై నమ్మకముంచింది. ఇప్పటికిప్పుడే టీ ట్వంటీలకు మరొక కోచ్ అవసరం లేదని తేల్చేసింది. ప్రస్తుతం ఈ ఏడాది వన్డే వరల్డ్ కప్ , టెస్ట్ ఛాంపియన్ షిప్ మాత్రమే ఉండడంతో టీ ట్వంటీలకు కూడా ద్రావిడే కొనసాగుతాడని బోర్డు వర్గాలు తెలిపాయి.

ద్రావిడ్ కు వర్క్ లోడ్ ఎక్కువైనప్పుడు వివిఎస్ లక్ష్మణ్ కోచ్ గా వ్యవహరిస్తాడని కూడా వెల్లడించాయి. అయితే షార్ట్ ఫార్మేట్ కు సంబంధించి కొందరు ఆటగాళ్ళను వచ్చే ప్రపంచకప్ కు సిద్ధం చేయాలన్న ప్రతిపాదనపై కూడా బీసీసీఐ దృష్టి పెట్టనుంది. ప్రస్తుతం టీ ట్వంటీలకు కెప్టెన్ గా హార్థిక్ పాండ్యా నియామకాన్ని పర్మినెంట్ చేయాలని బోర్డు భావిస్తోంది. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన చేసే అవకాశముంది.