IPL 2023 Auction: డిసెంబర్ లో ఐపీఎల్ మినీ వేలం

ఐపీఎల్ 16వ సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది మార్చి చివర్లో సీజన్ ఆరంభం కానుండగా.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 11:29 PM IST

ఐపీఎల్ 16వ సీజన్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. వచ్చే ఏడాది మార్చి చివర్లో సీజన్ ఆరంభం కానుండగా.. ఈ ఏడాది డిసెంబర్ మినీ వేలం జరగనుంది. బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాకున్నా బోర్డు వర్గాల సమాచారం ప్రకారం డిసెంబర్ 16వ తేదీన మినీ వేలం జరిగే అవకాశం కనిపిస్తోంది. తమ తమ జట్లలో ప్లేయర్లను సర్దుబాటు చేసేకునేందుకు ఈ వేలం నిర్వహిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం కూడా పంపించారు. అయితే వేలం వేదికపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాది ఫిబ్రవరి మెగా వేలం నిర్వహించగా.. కొత్త ఫ్రాంచైజీలతో కలిసి 10 జట్లు భారీగానే ఆటగాళ్ళను కొనుగోలు చేశాయి. అయితే ఈసారి ప్లేయర్స్‌ వేలం కోసం ఒక్కో ఫ్రాంఛైజీ గరిష్ఠంగా ఖర్చు చేసే మొత్తాన్ని రూ.5 కోట్లు పెంచి రూ.95 కోట్లుగా నిర్ణయించారు.

ఒకవేళ ఫ్రాంఛైజీలు ఎవరైనా ప్లేయర్స్‌ను వదిలేయడం లేదంటే ఇతర ఫ్రాంఛైజీల నుంచి తీసుకుంటే ఈ మొత్తం మరింత పెరిగే ఛాన్స్‌ ఉంది. ఈసారి చెన్నై సూపర్‌ కింగ్స్‌ టీమ్‌ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజాపైనే అందరి చూపు ఉంది. చెన్నై జట్టుతో జడేజా సంబంధాలు సరిగా లేవన్న వార్తల నేపథ్యంలో ఆ ఫ్రాంచైజీ వదిలేసే అవకాశాలున్నట్టు సమాచారం. ఇప్పటికే గుజరాత్‌ టైటన్స్‌తో జడేజాకు బదులుగా శుభ్‌మన్‌ గిల్‌ను చెన్నై టీమ్‌ ట్రేడ్‌ చేసిందన్న వార్తలు కూడా వచ్చాయి. జడేజా కోసం ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌ కూడా ప్రయత్నిస్తోంది. మరోవైపు జడేజాను వదులుకునే ఉద్దేశం తమకు లేదని కూడా చెన్నై టీమ్‌ వర్గాలు చెబుతున్నాయి.మొత్తం మీద మినీ వేలంతో పలువురు ప్లేయర్లు టీమ్స్ మారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదిలా ఉంటే ఈ సారి ఐపీఎల్ సీజన్ ఎప్పటిలానే హోమ్ , అవే పద్ధతిలో జరగనుంది. దీంతో మొత్తం 10 నగరాల్లోనూ ఐపీఎల్ మ్యాచ్ లు అభిమానులను అలరించబోతున్నాయి.