BCCI: సెలక్షన్ కమిటీపై బీసీసీఐ వేటు

టీ ట్వంటీ ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొత్తం సెలక్షన్ కమిటీపైనే వేటు వేసింది.

  • Written By:
  • Publish Date - November 19, 2022 / 12:05 AM IST

టీ ట్వంటీ ప్రపంచకప్ వైఫల్యం నేపథ్యంలో బీసీసీఐ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా మొత్తం సెలక్షన్ కమిటీపైనే వేటు వేసింది. చేతన్ శర్మ సారథ్యంలోని సెలక్షన్ కమిటీని తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది. వీరి స్థానంలో ఐదుగురు కొత్త సెలక్టర్లను నియమించనుంది.

దీని కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారీ అంచనాల మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆడిన టీమిండియా సెమీఫైనల్లో నిష్క్రమించింది. ఇంగ్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిపోవడంతో జట్టుపై విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా జట్టు ఎంపిక విషయంలో సెలక్షన్ కమిటీ వైఖరిపైనా పలువురు మాజీలు , బీసీసీఐలో కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. జట్టులో పలువురు సీనియర్ ఆటగాళ్ళపైనా విమర్శలు రావడంతో ప్రక్షాళన ఖాయమని భావించారు. అయితే జట్టు కంటే ముందు సెలక్షన్ కమిటీపైనే బోర్డు చర్యలు తీసుకుంది.

చేతన్ శర్మతో పాటు దేబాశిష్ మొహంతి, హర్విందర్ సింగ్, సునీల్ జోషీల స్థానంలో కొత్త వారిని ఎంపిక చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 7 టెస్టు మ్యాచ్‌లు, 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడి ఉండాలి లేదా 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్‌ మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. అంతేకాకుండా అభ్యర్థులు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకుని కనీసం 5 సంవత్సరాలు పూర్తి అయి ఉండాలని బీసీసీఐ తన ప్రకటనలో తెలిపింది. కాగా కొత్త సెలక్షన్ కమిటీ రేసులో మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది.