Vaibhav Suryavanshi: భారత క్రికెట్ భవిష్యత్తు కోసం అన్వేషణలో భాగంగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) యువ సంచలనం వైభవ్ సూర్యవంశీపై (Vaibhav Suryavanshi) ప్రత్యేక దృష్టి పెట్టింది. కేవలం 14 సంవత్సరాల వయస్సులోనే తన బ్యాటింగ్‌తో అందరినీ ఆకట్టుకుంటున్న ఈ బీహార్ యువకుడికి నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో ఒక ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.
ఇంగ్లండ్‌లో అద్భుత ప్రదర్శన, బీసీసీఐ కంట పడిన వైభవ్
ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన యూత్ వన్డే సిరీస్‌లో వైభవ్ అసాధారణమైన ప్రదర్శన కనబరిచాడు. 5 మ్యాచ్‌లలో ఏకంగా 355 పరుగులు సాధించి తన బ్యాటింగ్ సత్తా ఏంటో చూపించాడు. ఈ సిరీస్‌లో కేవలం 52 బంతుల్లోనే సెంచరీ చేసి, యూత్ వన్డే సిరీస్‌లో వేగవంతమైన శతకం సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ అద్భుత ప్రదర్శన బీసీసీఐ దృష్టిని ఆకర్షించింది. తక్షణమే బీసీసీఐ అతన్ని నేరుగా NCAకు పిలిపించింది.
Also Read: ICICI Bank : కస్టమర్లకు మరో షాక్.. ఆ ఛార్జీలు కూడా పెంచిన ఐసీఐసీఐ
ప్రత్యేక శిక్షణ ప్రణాళికతో వైభవ్ సూర్యవంశీ
NCAలో వైభవ్ కోసం ఒక వారం పాటు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ శిక్షణలో సాంకేతిక డ్రిల్స్, మ్యాచ్ పరిస్థితులపై ప్రధానంగా దృష్టి పెడతారు. వైభవ్ బ్యాటింగ్‌ను మరింత మెరుగుపరచడం, ఒత్తిడి పరిస్థితులలో ఎలా ఆడాలి అనే అంశాలపై అతనికి శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత, వైభవ్ తిరిగి అండర్-19 ఇండియా క్యాంప్‌లో చేరతాడు.
భవిష్యత్ కోసం సన్నాహాలు
వైభవ్ చిన్ననాటి కోచ్ మనీష్ ఓజా ఈ విషయంపై స్పందిస్తూ సీనియర్ క్రికెటర్లు రిటైర్ అవుతున్న నేపథ్యంలో వారి స్థానాలను భర్తీ చేయడానికి కొత్త తరం ఆటగాళ్లను సిద్ధం చేయడం చాలా ముఖ్యమని చెప్పారు. బీసీసీఐ చేపట్టిన ఈ శిక్షణ కార్యక్రమం వైభవ్‌ను ఆ స్థానంలో నిలిపేందుకు ఒక ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు. వైభవ్ సూర్యవంశీకి లభిస్తున్న ఈ ప్రత్యేక శిక్షణ, భవిష్యత్ భారత జట్టు కోసం యువ ప్రతిభావంతులను గుర్తించి, వారిని ఉన్నత స్థాయికి తీసుకురావాలనే బీసీసీఐ నిబద్ధతకు నిదర్శనం. ఈ యువ క్రికెటర్ తన ప్రతిభతో భవిష్యత్తులో భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతాడని క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు.