Asia Cup Trophy: ఆసియా కప్ ట్రోఫీ (Asia Cup Trophy) వివాదంపై బీసీసీఐ (BCCI) పెద్ద చర్య తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో రాబోయే ఐసీసీ (ICC) సమావేశంలో ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని అంతర్జాతీయ బోర్డును కోరే అవకాశం ఉంది. ట్రోఫీని భారత జట్టుకు అందించాలని కోరుతూ బీసీసీఐ గత వారం లేఖ పంపింది. అయితే నఖ్వీ వైపు నుంచి ఎలాంటి సమాధానం రాలేదని తెలుస్తోంది. దీంతో బీసీసీఐ గట్టి నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ హెచ్చరిక
భారత జట్టుకు ట్రోఫీని అందజేయాలని బీసీసీఐ స్పష్టంగా తేల్చి చెప్పింది. లేదంటే త్వరలో జరగబోయే ఐసీసీ సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తుతామని ప్రకటించింది. ప్రస్తుతం ఆసియా కప్ ట్రోఫీ దుబాయ్‌లోని ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) కార్యాలయంలో భద్రపరచబడి ఉంది. ఒక మీడియా నివేదిక ప్రకారం బీసీసీఐ కార్యదర్శి దేవజీత్ సైకియా మాట్లాడుతూ.. భారత బోర్డు చట్ట ప్రకారం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తోందని తెలిపారు.
Also Read: Delhi Air Quality: ఢిల్లీలో కమ్ముకున్న కాలుష్యపు పొగ.. ‘రెడ్ జోన్’లో గాలి నాణ్యత!
వివాదం ఎక్కడ మొదలైంది?
ఆసియా కప్ ఫైనల్‌లో భారత జట్టు పాకిస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో విజయం సాధించిన తర్వాత ఏసీసీ చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవడానికి నిరాకరించడంతో ఈ వివాదం మొదలైంది. కొద్దిసేపటి తర్వాత మొహ్సిన్ నఖ్వీ ట్రోఫీని తీసుకుని అక్కడి నుండి వెళ్లిపోయారు.
నఖ్వీ వైఖరిపై బీసీసీఐ అభ్యంతరం
కొన్ని వారాల క్రితం సెప్టెంబర్ 30న జరిగిన ఏసీసీ సమావేశంలో బీసీసీఐ ఉపాధ్యక్షులు, భారత ప్రతినిధి అయిన రాజీవ్ శుక్లా పాల్గొన్నారు. ఆ సమావేశంలో రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. ట్రోఫీ ఏషియన్ క్రికెట్ కౌన్సిల్ ఆస్తి కాబట్టి నఖ్వీ వ్యక్తిగతంగా ట్రోఫీని మైదానం నుండి తీసుకెళ్లడానికి అధికారం లేదని పేర్కొన్నారు.
ఏసీసీ బోర్డు సభ్యుల ముందు క్షమాపణ చెప్పినప్పటికీ నఖ్వీ జట్టు ఇండియాకు ట్రోఫీ ఇవ్వడానికి నిరాకరించారు. టీమ్ ఇండియా ట్రోఫీని తీసుకెళ్లాలనుకుంటే దుబాయ్‌లోని ఏసీసీ కార్యాలయానికి వచ్చి తన చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవాలని ఆయన పట్టుబట్టినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ఇప్పుడు ఐసీసీ జోక్యాన్ని కోరేందుకు సిద్ధమవుతోంది.