BCCI: ఈ సారి టార్గెట్ 50 వేల కోట్లు

ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

  • Written By:
  • Updated On - March 31, 2022 / 06:06 PM IST

ప్రపంచవ్యాప్తంగా ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. క్రికెట్ అభిమానులకు వినోదాన్ని అందిస్తున్న ఈ రిచెస్ట్ లీగ్ బీసీసీఐకి, స్పాన్సర్లకి, ఆటగాళ్లకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే బీసీసీఐకి ఐపీఎల్ బంగారు బాతు. అందుకే దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని నానాటికీ పెంచుకుంటుంది. ఈ క్రమంలోనే ఇటీవలే విడుదల చేసిన ఐపీఎల్  మీడియా హక్కుల వేలానికి సంబంధించి..  కనీస ధర (బేస్ ప్రైస్) ను కూడా అమాంతం పెంచింది. ప్రస్తుతం బీసీసీఐ అధికారిక ప్రసారదారుగా వ్యవహరిస్తున్న డిస్నీ స్టార్ ఒప్పందం ఈ ఏడాదితో ముగియనుంది. 2018లో స్టార్.. ఐపీఎల్ మీడియా హక్కులు దక్కించుకున్నప్పుడు వీటి బేస్ ప్రైస్.. రూ. 16,347.5 కోట్లుగా ఉండేది. ఇప్పుడు దానిని రూ. 33,000 కోట్లకు పెంచింది.

ఐపీఎల్ కు ఉన్న క్రేజ్ దృష్ట్యా కనీస ధరను పెంచినట్టు బీసీసీఐ అధికార ప్రతినిధి ఒకరు వెల్లడించారు.గత ఐదేండ్లలో దాని విలువ రెట్టింపయ్యిందనీ,అంతర్జాతీయ సంస్థలు కూడా ఐపీఎల్ వెంట పడుతున్నాయనీ చెప్పారు. భవిష్యత్ లో ఈ లీగ్ ఖండంతరాలు వ్యాపిస్తుందనడంలో సందేహమే లేదు. ఈ నేపథ్యంలోనే మీడియా హక్కుల విషయంలో కూడా తాము బేస్ ప్రైస్ ను నిర్ణయించామని వెల్లడించారు. మీడియా హక్కుల ద్వారా ఈ సారి రూ. 50వేల కోట్లను ఆర్జించడమే  బీసీసీఐ లక్ష్యంగా పెట్టుకుంది. రాబోయే ఐదేళ్ల కాలానికి అంటే 2023 నుంచి 2027 వరకు మీడియా రైట్స్ కోసం బీసీసీఐ ఇటీవలే టెండర్లను ఆహ్వానించింది. మీడియా హక్కుల కోసం జూన్‌ 12న వేలం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఐపీఎల్‌లోకి కొత్తగా రెండు కొత్త జట్లు రావడంతో మీడియా రైట్స్ కోసం భారీ ఎత్తున పోటీ నెలకొంది. తాజా సమాచారం ప్రకారం మీడియా రైట్స్ ద్వారా బీసీసీఐకి దాదాపుగా రూ. 50 వేల కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అమెజాన్ ప్రైమ్, జీ–సోనీ, రిలయన్స్‌ సంస్థలు ఎంత మొత్తం చెల్లించైనా మీడియా రైట్స్ దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.