Site icon HashtagU Telugu

BCCI: మాజీ క్రికెటర్లకు బీసీసీఐ గుడ్ న్యూస్

BCCI

BCCI

ఐపీఎల్ ప్రసార హక్కులు భారీ ధరకు అమ్ముడైన వేళ బీసీసీఐ ఆనందం మామూలుగా లేదు. E- వేలంలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. ప్రపంచ స్పోర్ట్స్ లో ఐపీఎల్ మీడియా రైట్స్ ఇప్పుడు రెండో అత్యధిక ధరకు అమ్ముడైన క్రీడగా నిలిచింది. ఈ సంతోషంలో ఉన్న బీసీసీఐ మాజీ క్రికెటర్లు , అంపైర్ల‌కు ఇచ్చే పెన్ష‌న్స్‌ను పెంచుతున్నట్టు ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ఓ లేఖ‌ను విడుదల చేసింది. ఈ పెంపు పురుషుల‌తో పాటు మ‌హిళా క్రికెట‌ర్లు, మాజీ అంపైర్ల‌కు వ‌ర్తిస్తుంద‌ని బీసీసీఐ తెలిపింది. క‌నిష్టంగా 15000 ఉన్న పెన్ష‌న్ ను 30 వేల రూపాయ‌ల‌కు పెంచింది. గ‌రిష్టంగా 50 వేల రూపాయ‌లు ఉన్న పెన్ష‌న్ ను 70 వేల‌కు పెంచారు.మొత్తం ఐదు కేట‌గిరీలుగా ఈ పెన్ష‌న్‌ను అందించ‌బోతున్న‌ట్లు బీసీసీఐ వెల్లడించింది. జూన్ 1 నుండి పెన్ష‌న్ పెంపు అమ‌లులోకి వ‌స్తుంద‌ని తెలిపింది. క్రికెట‌ర్ల‌కు ఆర్థికంగా అండ‌గా నిల‌వ‌డం బీసీసీఐ బాధ్య‌తని ప్రెసిడెంట్ సౌర‌భ్ గంగూలీ వ్యాఖ్యానించాడు. ఆట‌కు వీడ్కోలు ప‌లికిన త‌ర్వాత క్రికెటర్ల జీవితానికి భ‌రోసా నివ్వ‌టం చాలా ముఖ్య‌మ‌న్నాడు.

మరోవైపు భారత క్రికెట్‌ అభివృధిలో అంపైర్స్ చేసిన స‌హ‌కారం మ‌ర్చిపోలేనిదని, వారి సేవ‌ల‌ను బీసీసీఐ ఎప్పుడూ గౌర‌విస్తుంద‌ని గంగూలీ చెప్పాడు. ప్ర‌స్తుతం క్రికెట‌ర్లో పాటు మాజీ క్రికెట‌ర్ల సంక్షేమ‌మే బీసీసీఐ ప్ర‌ధాన ల‌క్ష్య‌మ‌ని సెక్ర‌ట‌రీ జ‌య్ షా పేర్కొన్నారు. పెన్ష‌న్ పెంపు వ‌ల్ల దాదాపు తొమ్మిది వంద‌ల మంది మాజీ క్రికెట‌ర్లు, అంపైర్ల‌కు ఆర్థికంగా ల‌బ్ది చేకూర‌నున్న‌ద‌ని జ‌య్ షా తెలిపాడు. ప్రపంచ క్రికెట్ లో అత్యధిక ఆదాయం వచ్చే బోర్డు గా ఘనత సాధించిన బీసీసీఐ చాలా కాలంగా మాజీ ఆటగాళ్ళకు పెన్షన్ అందిస్తోంది. వారి జాతీయ జట్టుకు , రంజీ జట్టుకు , దేశవాళీ క్రికెట్ కెరీర్ ప్రకారం అయిదు రకాలుగా విభజించి పెన్షన్ అందిస్తోంది. గతంలో రెండు సార్లు వన్ టైం బెనిఫిట్ స్కీం కింద సహాయం కూడా అందజేసింది. కాగా బీసీసీఐ పెన్షన్ మొత్తాన్ని పెంచడంపై మాజీ క్రికెటర్లు, అంపైర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు.