బీసీసీఐ ఆటగాళ్లకు సంబంధించిన సెంట్రల్ కాంట్రాక్టుల జాబితాను విడుదల చేసింది. తాజాగా ప్రకటించిన ఈ జాబితాలో ఆటగాళ్లు నాలుగు కేటగిరీల్లో చోటు దక్కించుకున్నారు.. వరుసగా నాలుగో టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి, టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా గ్రేడ్ ‘ఎ’ ప్లస్’లో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఈ ముగ్గురికి ఏడాది కాలానికి రూ. 7 కోట్లు చొప్పున చెల్లిస్తారు.
అలాగే ఈ జాబితాలో టీమిండియా టెస్టు ఆటగాళ్లు అజింక్యా రహానే, చతేశ్వర్ పుజారాలు ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘బీ’ గ్రేడ్ కు పడిపోయారు. గత కొంతకాలంగా ఫామ్ కోల్పోయి సతమతమవుతున్న వీరిద్దరూ శ్రీలంకతో సిరీస్ కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక సీనియర్ ఆల్రౌండర్ హార్థిక్ పాండ్యా కూడా ‘ఏ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్ కు పడిపోయాడు. వాస్తవానికి మూడేళ్ల కిందట వరకు పాండ్యా మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఉన్నాడు. అయితే 2019 ఆసియా కప్ లో వెన్నుముక గాయంతో బౌలింగ్ కు దూరమవడం అతడి కెరీర్ నే దెబ్బతీసింది. తిరిగి జట్టులోకి వచ్చినా ఒకటీ అరా మ్యాచ్ ల్లో తప్ప బౌలింగ్ చేయలేదు. బ్యాటింగ్ పరంగానూ పెద్దగా ఆకట్టుకోలేక పోయాడు.
అలాగే సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ‘బీ’ గ్రేడ్ నుంచి ‘సీ’ గ్రేడ్ కు పడిపోయాడు. సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కు ‘సి’ గ్రేడ్ మాత్రమే దక్కింది.వంద టెస్టులాడిన పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఏ నుంచి బి కి చేరాడు.
ప్రస్తుతం ఏ ప్లస్ ముగ్గరికే దక్కింది. కెప్టెన్ రోహిత్ శర్మ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేసర్ జస్ప్రిత్ బుమ్రా ఇందులో ఉన్నారు. అశ్విన్ జడేజా పంత్ కేఎల్ రాహుల్ మహ్మద్ షమీ ‘ఎ’లో ఉన్నారు. గతంలో ‘ఎ’గ్రేడ్లో 10 మంది ఆటగాళ్లకు చోటుండగా.. ఇప్పుడు ఈ ఐదుగురికే దానిని పరిమితం చేశారు.కొన్నాళ్లుగా జట్టు విజయాల్లో భాగమవుతున్న హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్ ను సి గ్రేడ్ నుంచి బి కి ప్రమోట్ చేశారు. ఇటీవలి బ్యాటింగ్ సంచలనం సూర్యకుమార్ యాదవ్ కు సి గ్రేడ్ దక్కింది.ఇక బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో ఎ+ కేటగిరీలో ఉన్న వారికి ఏడాదికి రూ.7 కోట్లు, ఎ కేటగిరీలో ఉన్న వారికి రూ.5 కోట్లు, బి కేటగిరీలో ఉన్న వారికి రూ.3 కోట్లు, సి కేటగిరీలో ఉన్న వారికి రూ.1 కోటి వార్షిక వేతనం అందుతుంది. దీనికి మ్యాచ్ ఫీజు అదనం.