Site icon HashtagU Telugu

BCCI: రోహిత్‌, విరాట్ రిటైర్మెంట్.. బీసీసీఐ కీల‌క ప్ర‌క‌టన‌!

BCCI

BCCI

BCCI: భారత జట్టు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ తీసుకున్నారు. టీ20 ఫార్మాట్‌కు ఇద్దరూ 2024 టీ20 వరల్డ్ కప్ తర్వాత వీడ్కోలు పలికారు. అయితే ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు వన్డే మ్యాచ్‌ల కోసం అందుబాటులో ఉంటారు. వారు వన్డే నుండి కూడా రిటైర్మెంట్ తీసుకుంటారనే వార్తలు ఇటీవ‌ల తెగ వైర‌ల్ అయ్యాయి. ఈ విషయంపై ఇప్పుడు బీసీసీఐ (BCCI) తమ ప్రకటనతో బోర్డు వైఖరిని స్పష్టం చేసింది.

రోహిత్-విరాట్ అన్ని వన్డే మ్యాచ్‌లు ఆడతారు: BCCI

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గురించి నడుస్తున్న చర్చలకు స్వస్తి పలుకుతూ బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మాట్లాడుతూ.. మేము ఎప్పటికీ చెప్పాలనుకుంటున్నాం మేమంతా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటును భావిస్తున్నాం. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ స్వయంగా రిటైర్మెంట్ తీసుకునే నిర్ణయం తీసుకున్నారు. బీసీసీఐ విధానం ప్రకారం మేము ఏ ఆటగాడినీ రిటైర్మెంట్ తీసుకోమని చెప్పము. లేదా ఫార్మాట్ గురించి నిర్ణయం తీసుకోము. రిటైర్మెంట్ నిర్ణయం ఆటగాళ్లపై ఆధారపడి ఉంటుంది. ఇద్దరూ స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వారు లేని లోటు మాకు బాధ కలిగిస్తుంది. వారిని మేము ఎప్పటికీ గొప్ప బ్యాట్స్‌మెన్‌లుగా గౌరవిస్తాం. మంచి విషయం ఏమిటంటే రోహిత్-విరాట్ వన్డే మ్యాచ్‌ల కోసం అందుబాటులో ఉండ‌టం అని ఆయ‌న పేర్కొన్నారు.

Also Read: UK Visa: లండ‌న్ వెళ్లాల‌ని అనుకుంటున్నారా? అయితే మీ అకౌంట్‌లో ఎంత డ‌బ్బు ఉండాలంటే?!

ఆగస్టులో శ్రీలంక‌తో సిరీస్ జరగవచ్చు!

టీమిండియా మొదట ఆగస్టు నెలలో బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్‌లోనే ఈ ఇద్దరు దిగ్గజ ఆటగాళ్లు ఎన్నో రోజుల తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడేవారు. అయితే ఈ సిరీస్‌ను బీసీసీఐ ఇప్పుడు వచ్చే ఏడాది వరకు వాయిదా వేసింది. రిపోర్టుల ప్రకారం.. శ్రీలంక జట్టు ఇప్పుడు భారత్‌తో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాలని కోరుకుంటోంది. అయితే ఈ విషయంపై బీసీసీఐ ఇంతవరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ అభిమానులు ఈ ఇద్దరు స్టార్ ఆటగాళ్లను మళ్లీ చూడడానికి ఉత్సాహంగా ఉన్నారు.

రెడ్ బాల్ క్రికెట్‌లో వరుసగా ఫామ్‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌ రోహిత్ శర్మ ఇంగ్లాండ్ పర్యటనకు ముందు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక సందేశం పోస్ట్ చేస్తూ తన టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ను ప్రకటించారు. కొన్ని రోజుల తర్వాత విరాట్ కోహ్లీ కూడా టెస్ట్ క్రికెట్‌ను వీడినట్టు ప్రకటించాడు. తన రెడ్ బాల్ కెరీర్ ముగిసినట్టు కోహ్లీ పోస్ట్ చేశాడు. ఈ ఇద్దరు దిగ్గజాల చివరి టెస్ట్‌ సిరీస్ ఆస్ట్రేలియా పర్యటనలోని బోర్డర్-గావస్కర్ ట్రోఫీతో ముగిసింది. ఈ సిరీస్‌లో భారత జట్టు 3-1తో ఓడిపోయింది. ఆ తర్వాత వీరిపై మరింత ఒత్తిడి పెరిగింది. దీనితో వారు ఈ నిర్ణయం తీసుకున్నట్లు క్రీడా పండితులు భావించారు.