BCCI Slaps Ban: సాహాను బెదిరించిన జర్నలిస్ట్ పై బీసీసీఐ కొరడా.. రెండేళ్లు బ్యాన్!!

ఇంటర్వ్యూ కావాలంటూ క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్ట్ బోరియా మజుందర్ గుర్తున్నాడు కదూ!!

  • Written By:
  • Publish Date - May 4, 2022 / 10:14 PM IST

ఇంటర్వ్యూ కావాలంటూ క్రికెటర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన జర్నలిస్ట్ బోరియా మజుందర్ గుర్తున్నాడు కదూ!! అతడిపై బీసీసీఐ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) కొరడా ఝుళిపించింది. బోరియా మజుందర్ పై రెండేళ్ల నిషేధం విధించింది. భారత్‌లో జరిగే దేశీయ లేదా అంతర్జాతీయ మ్యాచ్‌లకు ప్రెస్ సభ్యుడిగా అక్రెడిటేషన్‌ జారీ చేయడంపై నిషేధం విధించింది. భారత్‌లో రిజిష్టర్ అయిన క్రికెటర్లను ఇంటర్వ్యూ చేయడంపై నిషేధం వేసింది. బీసీసీఐ లేదా మెంబర్ అసోసియేషన్‌కు సంబంధించిన క్రికెట్ సౌలభ్యాలపైనా నిషేధం విధించింది. క్రికెటర్ల పట్ల అనుచితంగా వ్యవహరించేవారిని ఉపేక్షించబోమనే గట్టి సందేశాన్ని బీసీసీఐ ఇచ్చింది.

బోరియా మజుందార్ ఏం చేశాడు..?

బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాడైన సాహా ఫిబ్రవరి 23న ఓ స్ర్కీన్ షాట్‌ను షేర్ చేశాడు. ఇంటర్వ్యూ కావాలంటూ పేరు తెలియని ఓ వ్యక్తి తనను బెదిరిస్తున్నాడని ఆరోపించాడు. బెదిరించిన ఆ వ్యక్తి జర్నలిస్ట్ బోరియా మజుందార్ అని తేలింది. దీంతో బీసీసీఐ రంగంలోకి దిగింది. తమ ఇద్దరి మధ్య జరిగిన వాట్సప్ చాటింగ్‌ను సాహా ఏమార్చాడని గతంలో బోరియా మజుందార్ ఆరోపించాడు. దీంతో ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు.. వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా, ట్రెజరర్ అరుణ్ ధుమాల్, అపెక్స్ కౌన్సిల్ మెంబర్ ప్రభ్‌తేజ్ భాటియాతో కూడిన త్రిసభ్య కమిటీని బీసీసీఐ ఏర్పాటు చేసింది. ఇరుపక్షాలూ గత నెల్లో బీసీసీఐ అపెక్స్ కమిటీ ముందు హాజరయ్యాయి. తమ వాదనలను వినిపించారు. జర్నలిస్ట్ బోరియా మజుందార్‌ తప్పును తేల్చిన కమిటీ రెండేళ్ల నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.