Site icon HashtagU Telugu

T20 World Cup: శ్రేయస్‌ అయ్యర్‌, ర‌వి బిష్ణోయ్‌ల‌కు షాక్ ఇచ్చిన బీసీసీఐ..!

Shreyas Iyer

Shreyas Iyer

టీ20 ప్రపంచ కప్ 2022 కోసం టీమిండియా 15 మంది సభ్యుల జట్టును చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ విడుదల చేసినప్పుడు.. నలుగురు ఆటగాళ్లు స్టాండ్‌బై జాబితాలో ఉన్నారు. వారిలో మహ్మద్ షమీ, దీపక్ చాహర్, శ్రేయ అయ్యర్, రవి బిష్ణోయ్ ఉన్నారు. అయితే.. షమీ బుధవారం (అక్టోబర్ 12) ఆస్ట్రేలియాకు చేరుకోగా, చాహర్ వెన్ను స‌మ‌స్య‌ వల్ల ఈ టోర్నీకి దూర‌మయ్యాడు.

ఇప్ప‌టికే టీమిండియా ఆల్ రౌండ‌ర్ ర‌వీంద్ర జ‌డేజా, జస్‌ప్రీత్‌ బుమ్రా గాయాల కార‌ణంగా టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు వైదొలగడంతో షమీతో పాటు శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాకు వెళ్లారు. ఈ క్ర‌మంలోనే టీ20 వరల్డ్‌కప్‌ కోసం ప్రకటించిన భారత జట్టులో రిజర్వ్‌ ఆటగాళ్లుగా ఎంపికైన శ్రేయస్‌ అయ్యర్‌, రవి బిష్ణోయ్‌కి బీసీసీఐ ఊహించని షాక్‌ ఇచ్చింది. వీరిద్దరిని టీ20 వరల్డ్‌కప్‌ రిజర్వ్‌ ఆటగాళ్ల జాబితా నుంచి తప్పించింది. ఇండియాలోనే ఉండి ముస్తాక్‌ అలీ ట్రోఫీలో ఆడాలని ఆదేశించింది. శ్రేయస్‌ను ముంబై జట్టుతో, రవి బిష్ణోయ్‌ని రాజస్థాన్ జట్టుతో కలవాలని బీసీసీఐ ఆదేశాలు జారీ చేసింది.

ముఖ్యంగా.. దక్షిణాఫ్రికాతో ముగిసిన మూడు మ్యాచ్‌ల వ‌న్డే సిరీస్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్‌ 50, 113 నాటౌట్‌, 28 నాటౌట్‌ పరుగులతో అద్భుతమైన ఫామ్ క‌న‌బ‌ర్చాడు. దీపక్ హుడా ఫిట్‌గా ఉన్నాడని, అందువల్ల ఎవరైనా స్పెషలిస్ట్ బ్యాటర్‌కు గాయమైతే మాత్రమే పిలుస్తామని శ్రేయస్‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది. ముస్తాక్ అలీ ట్రోఫీని ఆడటానికి సిద్ధంగా ఉండమని శ్రేయ‌స్‌ను కోరిన‌ట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒక‌రు తెలిపారు.

ప్రస్తుతం కొనసాగుతున్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో శ్రేయస్ ముంబైకి ప్రాతినిధ్యం వహించనున్నాడు. రవి బిష్ణోయ్ కూడా దేశవాళీ టోర్నమెంట్‌లో పాల్గొనేందుకు భారత్‌లోనే ఉంటున్న‌ట్లు ఆ అధికారి తెలిపారు. బిష్ణోయ్‌ రాజస్థాన్ తరపున ఆడ‌నున్నాడు. శ్రేయస్ అయ్యర్ ఈ సంవత్సరం ప్రారంభంలో టీమిండియా T20 ప్రపంచ కప్ జట్టులో స్థానం కోసం పోటీ ప‌డ్డాడు. కానీ సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడాలు త‌మ ఆట‌తీరుతో టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ జ‌ట్టులో చోటు సంపాదించారు.