Rs 1.25 crore Prize Money: ఐపీఎల్ గ్రౌండ్స్‌మెన్‌కు బీసీసీఐ భారీ నజరానా

దాదాపు రెండు నెలలకు పైగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరపడింది.

  • Written By:
  • Publish Date - May 30, 2022 / 11:26 PM IST

దాదాపు రెండు నెలలకు పైగా క్రికెట్ ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించిన ఐపీఎల్ 15వ సీజన్‌కు తెరపడింది. ఎవరూ ఊహించని విధంగా చెన్నై, ముంబై, బెంగళూరు వంటి టాప్ జట్లు నిరాశపరిస్తే… తొలి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్ టైటిల్ కైవసం చేసుకుంది. కోవిడ్ కారణంగా ఈ సారి నాలుగు నగరాలకే లీగ్‌ను పరిమితం చేసింది బీసీసీఐ.

అయితే నాలుగు వేదికల్లో పిచ్‌లను స్పోర్టివ్‌గా రూపొందించేందుకు గ్రౌండ్ సిబ్బంది కష్టపడ్డారు. లీగ్ స్టేజ్‌ మొత్తం ముంబైలోని మూడు, పుణెలోని ఎంసీఏ స్టేడియంలో జరిగితే… ప్లేఆఫ్స్‌కు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ఆతిథ్యమిచ్చాయి. ఈ సారి పిచ్‌లతో పాటు స్టేడియాల నిర్వహణకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులూ రాకపోవడంతో బీసీసీఐ ఫుల్ హ్యాపీగా ఉంది. దీంతో ఈ ఆరు వేదికల్లోని క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌కు బీసీసీఐ రూ.1.25 కోట్ల ప్రైజ్‌మనీ ప్రకటించింది.

మెజార్టీ మ్యాచ్‌లకు ఆతిథ్యమిచ్చిన ముంబైలోని వాంఖెడే, బ్రాబౌర్న్‌, డీవై పాటిల్‌.. పుణెలోని ఎంసీఏ స్టేడియాలు ఒక్కోదానికి రూ.25 లక్షలు దక్కనున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌, అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియాలు ఒక్కోదానికి రూ.12.5 లక్షలు ఇవ్వనున్నారు. టాటా ఐపీఎల్ 2022లో మంచి మ్యాచ్‌లను అందించిన గ్రౌండ్‌ సిబ్బందికి ప్రైజ్‌మనీ ప్రకటించడం సంతోషంగా ఉందని, ఈ క్యూరేటర్లు, గ్రౌండ్స్‌మెన్‌ తెర వెనుక హీరోలని బీసీసీఐ సెక్రటరీ జై షా ట్విటర్‌లో పేర్కొన్నారు.

వాళ్ల కష్టం వల్లనే వల్లే లీగ్‌లో కొన్ని మ్యాచ్‌లు ఎంతో ఉత్కంఠ రేపాయని ఆయన చెప్పారు. ఈ సీజన్‌లో ముంబై, పుణెల్లోని నాలుగు స్టేడియాల్లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు జరిగాయి. ఇన్ని మ్యాచ్‌లు కేవలం నాలుగు గ్రౌండ్‌లలోనే జరిగినా.. అక్కడి పిచ్‌లు మొదటి నుంచీ చివరి వరకూ బ్యాటర్లు, బౌలర్లకు సమానంగా అనుకూలించాయి. బీసీసీఐ పెద్దమనసుతో గ్రౌండ్స్‌మెన్‌కు కూడా ప్రైజ్‌మనీ ప్రకటించడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.