స్టార్ ప్లేయర్స్ కు సెలక్టర్ల షాక్..

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది.

  • Written By:
  • Publish Date - January 6, 2022 / 05:48 PM IST

ఐసీసీ వన్డే ప్రపంచకప్ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత మహిళా క్రికెట్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్‌ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా..హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ వైస్‌ కెప్టెన్‌గా ఎంపికైంది. స్మృతి మంధాన, ఝులన్ గోస్వామి, యువ షెఫాలీ వర్మ కూడా జట్టులోకి వచ్చారు. అయితే చాలా మంది కీలక ప్లేయర్లు జట్టులో చోటు దక్కించుకోలేకపోయారు. వీరిలో స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్, ఆల్ రౌండర్ శిఖా పాండే కూడా ఉన్నారు. ముఖ్యంగా జెమీమా రోడ్రిగ్స్ జట్టులో చోటు దక్కించుకోకపోవడం చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది. గత ఏడాది కాలంలో ఇంగ్లండ్, ఆస్ట్రేలియా టీ20 లీగ్‌లలో ఆమె అద్భుతంగా రాణించింది. అయితే గతేడాది ఒక్క వన్డే మ్యాచ్‌లోనూ జెమీమా రెండంకెల స్కోరు సాధించలేకపోయింది. సెలక్టర్లు కేవలం వన్డే ప్రదర్శనను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. ఈ కారణంగానే ఆమె ఎంపిక కాలేదని తెలుస్తోంది. అటు పేలవ ఫామ్ కారణంగా ఆల్ రౌండర్ శిఖా పాండేకు జట్టులో చోటు దక్కలేదు.

ఇదిలా ఉంటే ఎక్స్ పీరియన్స్ బ్యాటర్ పూనమ్ రౌత్ ను కూడా సెలక్టర్లు పక్కనపెట్టారు. నిలకడగా రాణిస్తున్నా కేవలం స్లో బ్యాటింగ్ కారణంగానే ఆమెను ఎంపిక చేయలేదని సమాచారం. వీరితో పాటు సుష్మా వర్మ, వేదా కృష్ణమూర్తి, మోనా మెష్రామ్, మాన్సీ జోషి, నుజత్ పర్వీన్ వంటి క్రీడాకారిణులు కూడా ఎంపిక కాలేదు. వీరంతా వన్డేల్లో నిలకడగా రాణించకపోవడమే ప్రధాన కారణంగా భావిస్తున్నారు. పలు అవకాశాలు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేకపోవడంతో సెలక్టర్లు యువ క్రీడాకారిణిలు వైపే మొగ్గుచూపారు.

మార్చి 4వ తేదీ నుంచి ఏప్రిల్ 13వ తేదీ వరకు న్యూజిలాండ్ వేదికగా మహిళల వన్డే ప్రపంచకప్ 2022 జరగనుంది. ఈ మెగా టోర్నీలో భారత్ తన తొలి మ్యాచ్ లో మార్చి 6న దాయాది పాకిస్థాన్ తో తలపడనుంది. మార్చి 6న జరిగే ఈ మ్యాచ్ మార్చి 6న తన తొలి మ్యాచ్‌ను దాయాది పాకిస్థాన్‌తో ఆడనుంది. మరోవైపు ప్రపంచకప్ కంటే ముందు న్యూజిలాండ్‌తో టీ20, వన్డే సిరీస్ ఆడనుంది.