భారత మహిళా క్రికెట్ జట్టు ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో తొలిసారి టీమిండియా ట్రోఫీని ముద్దాడింది. దాంతో దక్షిణాఫ్రికాను ఓడించి ట్రోఫీని సొంతం చేసుకున్న టీమిండియాకు బీసీసీఐ రూ. 51 కోట్ల భారీ నజరానా ప్రకటించింది. షఫాలీ వర్మ, దీప్తి శర్మల అద్భుత ప్రదర్శనతో భారత్ విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయం మహిళా క్రికెట్‌కు కొత్త ఊపునిచ్చింది.
ఐసీసీ మహిళల వన్డే వరల్డ్ కప్ చరిత్రలో భారత మహిళా జట్టు తొలిసారి ట్రోఫీ ముద్దాడింది. దక్షిణాఫ్రికాపై జరిగిన ఫైనల్‌లో అద్భుత విజయంతో వరల్డ్ కప్‌ను గెలుచుకుంది. వరల్డ్ ఛాంపియన్ టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. భారత మహిళా క్రికెట్ జట్టుకు రూ. 51 కోట్ల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా ప్రకటించారు. ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఈ నగదు బహుమతి ఇవ్వనున్నారు.
దేవజిత్ సైకియా మాట్లాడుతూ “1983లో కపిల్ దేవ్ ప్రపంచకప్ గెలిపించి భారత క్రికెట్‌లో ఒక కొత్త యుగాన్ని ప్రారంభించారు. ఈ రోజు హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని మహిళల జట్టు కూడా అదే స్థాయిలో ఉత్సాహాన్ని దేశానికి అందించింది. వారు కేవలం ట్రోఫీ గెలుచుకోవడమే కాదు, కోట్లాది మంది భారతీయుల హృదయాలను గెలుచుకున్నారు. సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై సాధించిన విజయం మహిళా క్రికెట్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది” అని అన్నారు.
జై షా బీసీసీఐ కార్యదర్శిగా 2019లో బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత నుంచి మహిళా క్రికెట్‌లో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. పురుషులు, మహిళలకు సమాన వేతన విధానంతీసుకువచ్చారు. అలాగే ఐసీసీ చైర్మన్‌గా జై షా మహిళల ప్రైజ్ మనీని 300 శాతం పెంచారు. ముందు 2.88 మిలియన్ డాలర్లు ఉన్న ప్రైజ్ మనీని 14 మిలియన్ డాలర్లకు పెంచారు. ఇవన్నీ మహిళా క్రికెట్ అభివృద్ధికి దోహదపడ్డాయి అని సైకియా అన్నారు.
ఇక ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ విషయానికి వస్తే డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ ఆద్యంతం ఆకట్టుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకు యంగ్ అండ్ డాషింగ్ ఓపెనర్ షఫాలీ వర్మ అందించిన అద్భుత ఆరంభం జట్టు స్కోర్‌ను 298 పరుగులకు చేర్చింది. ఛేజింగ్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్ సెంచరీ చేసినప్పటికీ.. స్పిన్ మాంత్రికురాలు దీప్తి శర్మ బౌలింగ్‌తో భారత్‌ను గెలిపించింది. సఫారీలు 246 పరుగులకు ఆలౌట్ కావడంతో భారత్ తొలి వన్డే వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది.
టీమిండియా మహిళా జట్టు వన్డే వరల్డ్ కప్ అందుకున్న తర్వాత సంబరాలు మిన్నంటాయి. మాజీ క్రికెటర్లు జులన్ గోస్వామీ, మిథాలీ రాజ్ సైతం టీమిండియా ట్రోఫీని ముద్దాడి సంబరాల్లో మునిగిపోయారు. ఈ విజయం వెనుక ఉన్న కోచ్ అమోల్ మజుందార్‌ని అందరూ ప్రత్యేకంగా అభినందించారు. భారత మహిళల క్రికెట్ చరిత్రలో ఈ వరల్డ్‌కప్ ఓ మైలురాయిలా మిగిలిపోనుంది.
