Site icon HashtagU Telugu

New Rule: టాస్ తర్వాతే తుది జట్టు.. ఐపీఎల్ లో కొత్త రూల్

Whatsapp Image 2023 03 22 At 19.14.28

Whatsapp Image 2023 03 22 At 19.14.28

New Rule: క్రికెట్ లో ఏ మ్యాచ్ కైనా టాస్ వేసే ముందే తుది జట్టును అంపైర్లకు, ప్రత్యర్థి జట్టు కెప్టెన్ కు అందజేయాల్సి ఉంటుంది. ఇకపై ఐపీఎల్ లో ఈ సంప్రదాయానికి ముగింపు పలకనున్నారు. టాస్ వేసిన తర్వాత తుది జట్టును ఎంపిక చేసుకునేలా వెసులుబాటు కల్పించారు. ఈ కొత్త రూల్ వచ్చే ఐపీఎల్ సీజన్ నుంచే అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి బీసీసీఐ ఫ్రాంచైజీలకు స్పష్టతనిచ్చింది. ఇటీవల ముగిసిన సౌతాఫ్రికా టీ20 లీగ్ లో ఈ నిబంధనను తొలిసారి ప్రవేశపెట్టారు. అనుకున్నట్టుగానే కొత్త రూల్ బాగానే సక్సెస్ అయింది. టాస్ ముగిసిన తర్వాత 13 మందితో కూడిన జాబితాను కెప్టెన్ అంపైర్ కు అందజేయాలి. టాస్ అనేది తుది జట్టు కూర్పులో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతర్జాతీయ మ్యాచ్ లలో ఇది ప్రవేశపెట్టే అవకాశం లేకున్నా… అభిమానులకు వినోదాన్ని అందించే ఐపీఎల్ లాంటి లీగ్స్ లో ఇలాంటి రూల్స్ మరింత ఆసక్తిని రేకెత్తిస్తాయని చెప్పొచ్చు. సౌతాఫ్రికా మాజీ కెప్టెన్ గ్రేమ్ స్మిత్ ఈ రూల్ ను తమ కొత్త లీగ్ లో తీసుకొచ్చాడు. చాలా మంది మాజీలు, ప్రస్తుత ఆటగాళ్ళు కూడా ఈ కొత్త రూల్ కు మద్ధతిచ్చారు.

ఇప్పుడు బీసీసీఐ కూడా ఇదే రూల్ ను ఫాలో అవుతోంది. ఇదిలా ఉంటే వచ్చే ఐపీఎల్ సీజన్ లో మరికొన్ని రూల్స్ అలరించబోతున్నాయి. నిర్ణీత సమయంలో ఓవర్ల కోటా పూర్తి చేయకుంటే మిగిలిన ఓవర్లకు 30 యార్డ్ సర్కిల్ అవతల నలుగురు ఫీల్డర్లను మాత్రమే అనుమతిస్తారు. గతంలో స్లో ఓవర్ రేట్ కు మ్యాచ్ ఫీజులో కోత విధించేవారు. ఇప్పుడు ఫీల్డర్ల నిబంధనను అమలు చేస్తున్నారు. అలాగే బౌలర్ బంతిని వేసే ముందు వికెట్ కీపర్ లేదా ఫీల్డర్ అనవసరంగా కదిలితే డెడ్ బాల్ గా ప్రకటించడంతో పాటు బ్యాటింగ్ జట్టుకు 5 పరుగులు ఇస్తారు. ఇప్పటికే విదేశీ లీగ్స్ లో ఉన్న పలు నిబంధనలను కూడా బీసీసీఐ ఐపీఎల్ లోకి తీసుకొచ్చింది. బిగ్ బాష్ లీగ్ లో సూపర్ హిట్ అయిన ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కూడా ఈ ఐపీఎల్ సీజన్ నుంచే అమల్లోకి రానుంది. తుది జట్టులో లేని ఆటగాడిని మైదానంలోకి దింపొచ్చు, ఇన్నింగ్స్ 14వ ఓవర్ లోపు మాత్రమే దీనిని వినియోగించుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సీజన్ నుంచి వైడ్ , నోబాల్స్ కు రివ్యూ తీసుకోవచ్చు.గతంలో వైడ్, నోబాల్స్ విషయంలో అంపైర్లు తీసుకున్న నిర్ణయాలు మ్యాచ్ ఫలితాలపై తీవ్రంగానే ప్రభావం చూపడంతో ఈ రూల్ ను తీసుకొచ్చారు. మొత్తం మీద కొత్త రూల్స్ తో ఐపీఎల్ 16వ సీజన్ అభిమానులకు కిక్ ఇవ్వడం ఖాయం.

Exit mobile version