ముదురుతున్న ముస్తాఫిజుర్ వివాదం.. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ 2026 ప్రసారాలపై నిషేధం?

ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

Published By: HashtagU Telugu Desk
Mustafizur Rahman

Mustafizur Rahman

IPL 2026: ముస్తాఫిజుర్ రెహమాన్ వ్యవహారం భారత్- బంగ్లాదేశ్ మధ్య వివాదానికి దారితీస్తోంది. కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుండి ఈ బంగ్లాదేశ్ పేసర్‌ను విడుదల చేయాలని బీసీసీఐ ఆదేశించడంతో మొదలైన ఈ వివాదం, ఇప్పుడు రాజకీయ మలుపు తీసుకుంది. ముస్తాఫిజుర్ రెహమాన్ విషయంలో చోటుచేసుకున్న పరిణామాలు ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రభుత్వం వరకు వెళ్లాయి. దేశంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 కవరేజీని పూర్తిగా నిషేధించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం యోచిస్తోంది.

బంగ్లాదేశ్ చట్టం, న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ సోషల్ మీడియా వేదికగా ఒక కీలక ప్రకటన చేశారు. ముస్తాఫిజుర్‌పై బీసీసీఐ నిషేధం విధించాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐపీఎల్ ప్రసారాలను బంగ్లాదేశ్‌లో నిలిపివేయాలని ఆయన సమాచార- ప్రసార మంత్రిత్వ శాఖను కోరారు. బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ ప్రసారాలను నిలిపివేయాలని నేను సమాచార శాఖను కోరాను. బంగ్లాదేశ్ క్రికెట్‌ను గానీ, మా క్రికెటర్లను గానీ, మా దేశాన్ని గానీ అవమానిస్తే మేము ఏమాత్రం సహించం. బానిసత్వపు రోజులు ముగిసిపోయాయి అని అన్నారు.

Also Read: మన శంకర వర ప్రసాద్ గారు ట్రైల‌ర్ వ‌చ్చేసింది.. వెంకీ మామ ఎంట్రీ అదుర్స్‌!

ఈ అంశంపై బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కూడా కొంత అసంతృప్తితో ఉన్నప్పటికీ బోర్డు అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అసలు విషయం ఏమిటంటే.. ఈ వ్యవహారంపై బీసీసీఐ నుండి తమకు ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం అందలేదని బీసీబీ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితులపై బంగ్లాదేశ్ సమాచార- ప్రసార సలహాదారు సయ్యదా రిజ్వానా హసన్ మాట్లాడుతూ.. క్రీడల్లో రాజకీయాలు రావడం దురదృష్టకరమని అన్నారు. సాధారణంగా దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించడానికి క్రీడలు దోహదపడతాయని, కానీ భారత్-బంగ్లాదేశ్ విషయంలో ఇది రివర్స్ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ విషయంలో చట్టపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవచ్చనే అంశంపై సమీక్షిస్తోంది.

  Last Updated: 04 Jan 2026, 06:27 PM IST