Site icon HashtagU Telugu

T20 Match: నెదర్లాండ్స్ పోరాడినా బంగ్లాదే విజయం

Bangladesh Imresizer

Bangladesh Imresizer

టీ ట్వంటీ ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ శుభారంభం చేసింది. ఆసక్తికరంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ 9 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన బంగ్లా జట్టు 144 పరుగులు చేసింది. ఓపెనర్ 25 పరుగులతో రాణించగా.. సౌమ్య సర్కార్, లిట్టన్ దాస్, కెప్టెన్ షకీబుల్ హసన్ నిరాశపరిచారు. అయితే ఆసిఫ్ హొస్సేన్ 38 , మోదదెక్ హొస్సేన్ 20 పరుగులతో ఆదుకున్నారు. ఆద్యంతం నెదర్లాండ్స్ బౌలర్లు ఆకట్టుకున్నారు. బంగ్లాదేశ్ భారీస్కోర్ చేయకుండ కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారు. నెదర్లాండ్స్ బౌలర్లలో మెకెరీన్ 2 , లీడే 2 వికెట్లు పడగొట్టారు. ఛేజింగ్ లో నెదర్లాండ్స్ తొలి రెండు బంతులకే రెండు వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్లతో పాటు టాపార్డర్ బ్యాటర్లు విఫలమయ్యారు.దీంతో 15 రన్స్ కే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కొలిన్ ఎకర్ మాన్ , వికెట్ కీపర్ స్కాట్ ఎడ్వర్డ్స్ పోరాడారు. వీరిద్దరూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు. కొలిన్ బంగ్లా బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. అయితే చివరి ఆరు ఓవర్లలో నెదర్లాండ్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. కొలిన్ క్రీజులో ఉండడం, తర్వాత టెయిలెండర్ పాల్ ధాటిగా ఆడడంతో నెదర్లాండ్స్ బంగ్లాకు షాకిచ్చేలా కనిపించింది. కొలిన్ 62 పరుగులకు ఔటవడంతో వారి ఆశలకు తెరపడింది. తర్వాత పాల్ పోరాడినా ఫలితం లేకపోయింది. నెదర్లాండ్స్ 20 ఓవర్లలో 135 పరుగులకు ఆలౌటైంది. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ 4 , హసన్ 2 వికెట్లు పడగొట్టారు.