Site icon HashtagU Telugu

Bangladesh : పోరాడి ఓడిన భారత్ లో… స్కోరింగ్ థ్రిల్లర్ లో బంగ్లా గెలుపు

Bangladesh

Bangladesh

బంగ్లాదేశ్ టూర్ ను టీమిండియా ఓటమితో ఆరంభించింది. ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్ 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. కీలక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్లు ఆ జట్టు చివరి బ్యాటర్లను ఔట్ చేయలేక పోయారు. దీంతో భారత్ కు ఓటమి తప్పలేదు. మొదట బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. కే ఎల్ రాహుల్ తప్పిస్తే మిగిలిన వారంతా విఫలమయ్యారు. అంచనాలు పెట్టుకున్న రోహిత్ , ధావన్, కోహ్లీ నిరాశపరిచారు. శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ కాసేపు క్రీజులో నిలవడంతో వికెట్ల పతనం ఆగింది. అయ్యర్ 24 రన్స్ కు ఔటవగా.. వాషింగ్టన్ సుందర్ 19 రన్స్ చేశాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా కేఎల్ రాహుల్ హాఫ్ సెంచరీతో పోరాడాడు. దీంతో స్కోర్ 150 దాటగలిగింది. ధాటిగా ఆడిన రాహుల్ 70 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 73 రన్స్ చేశాడు. రాహుల్ ఔటైన తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టలేదు. దీంతో టీమిండియా 41.2 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌటైంది. బంగ్లాదేశ్ బౌలర్లలో షకీబుల్ హసన్ 10 ఓవర్లలో 35 రన్స్ ఇచ్చి 5 వికెట్లు పడగొట్టగా.. హొస్సేన్ 4 వికెట్లు తీసాడు.

187 పరుగుల లక్ష్య చేదనలో బంగ్లాదేశ్ తొలి బంతికే వికెట్ కోల్పోయింది. కెప్టెన్ లిట్టన్ దాస్ , షకిబుల్ ఇన్నింగ్స్ గాడిలో పెట్టేందుకు ప్రయత్నించారు. వీరిద్దరూ క్రీజులో ఉన్నంత సేపూ బంగ్లా విజయం ఖాయమని భావించారు. అయితే కీలక సమయంలో భారత పేసర్లు వరుస వికెట్లు పడగొట్టి బంగ్లాను దెబ్బ తీశారు. అరంగేట్రం చేసిన కులదీప్ సేన్ , హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ తో పాటు స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ కలిసికట్టుగా రాణించారు. దీంతో బంగ్లాదేశ్ 136 రన్స్ కు 9 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో భారత్ విజయం లాంఛనమే అనుకున్నారు. అయితే మెహదీ హాసన్ అద్భుతంగా పోరాడాడు. మరో టెయిలెండర్ ముస్తఫిజర్ తో కలిసి జట్టును గెలిపించారు.రెండు క్యాచ్ లు జారవిడవడం కూడా బంగ్లాకు కలిసొచ్చింది. దీంతో బంగ్లా 46వ ఓవర్లో టార్గెట్ అందుకుంది. ఈ గెలుపుతో మూడు వన్డేల సిరీస్ లో బంగ్లాదేశ్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. సీరీస్ లో రెండో వన్డే బుధవారం ఢాకాలో జరుగుతుంది.