Hyd Match Tkts: టిక్కెట్ల అమ్మకంతో మాకు సంబంధం లేదు : అజారుద్దీన్

ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న క్రికెట్‌ మ్యాచ్‌ విషయంలో HCA ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

  • Written By:
  • Publish Date - September 23, 2022 / 10:35 PM IST

ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న క్రికెట్‌ మ్యాచ్‌ విషయంలో HCA ఘోరంగా విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో అందరి వేళ్లు అజారుద్దీన్‌ వైపే చూపిస్తున్నాయి. మూడేళ్ల తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే అంతర్జాతీయ క్రికెట్‌ మ్యాచ్‌ ఆదిలోనే వివాదాలమయమైంది. టికెట్ల విక్రయంలో భారీ అవినీతి జరిగిందని, హెచ్‌సీఐ అధ్యక్షుడు ఆజారుద్దీన్ తీవ్ర నిర్లక్ష్యం వహించారని అభిమానులు, పలు సంఘాలు, పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి.

టికెట్ల అమ్మకంలోనే హైదరాబాద్‌… ప్రపంచ దేశాల ముందు ఆబాసుపాలైందని అంటున్నారు. అయితే అజారుద్దీన్ మాత్రం లైట్ తీసుకున్నారు. జింఖానా ఘటనతో పాటు టిక్కెట్ల అమ్మకం, మ్యాచ్ కు ఏర్పాట్లపై మీడియాతో మాట్లాడారు. టిక్కెట్ల అమ్మకం తమకు ఏమాత్రం సంబంధం లేదన్నారు. పేటీఎంకు కాంట్రాక్ట్ ఇచ్చామని స్పష్టం చేశారు. బ్లాక్‌లో టికెట్ల అమ్ముకున్నారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. తాము టికెట్లు బ్లాక్ చేయలేదని.. కాంప్లిమెంటరీ పాసులు ఏవి లేవని వివరించారు. ఇక జింఖానా గ్రౌండ్ దగ్గర ఏం జరిగిందో పోలీసులకు తెలుసని, నిన్న జరిగిన ఘటనకు తాము బాధ్యులము కాదని చెప్పారు. బాధితుల వైద్య ఖర్చులు హెచ్‌సీఏనే భరిస్తుందని చెప్పిన అజారుద్దీన్.. తాను ఏ తప్పు చేయలేదన్నారు. పోలీసులు తమపై కేసులు నమోదు చేస్తే.. తాము పేటీఎంపై కేసులు పెడతామన్నారు. తమ అసోసియేషన్‌లో ఉన్న కొందరూ బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, మ్యాచ్ పూర్తయ్యాక మరిన్ని విషయాలు చెబుతానన్నారు.

ఆదివారం జరిగే మ్యాచ్ కోసం మైదానాన్ని పూర్తిగా సిద్దం చేశామని చెప్పారు. ఈ మ్యాచ్ కోసం బ్యాటింగ్ ట్రాక్ ఏర్పాటు చేశామన్న అజార్.. మ్యాచ్ రసవత్తరంగా జరుగుతుందన్నారు. టిక్కెట్ల అమ్మకంలో ఆరోపణలు సరికాదని, పైగా టిక్కెట్లు మాత్రమే చూసుకోవడం తన పని కాదన్నారు. కాగా ఆన్‌లైన్‌, ఆఫ్ లైన్ టికెట్లు ఎన్ని విక్రయించారో అజహర్‌ క్లారిటీ ఇవ్వకపోవడం క్రీడాభిమానుల ఆగ్రహానికి కారణమైంది. మరోవైపు ఉప్పల్‌ స్టేడియంలో అరకొర ఏర్పాట్లు మాత్రమే ఉన్నాయని…, విరిగిన కుర్చీలు, ఎగిరిపోయిన పైకప్పు వెక్కిరిస్తున్నాయని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఇదిలా ఉంటే అజారుద్దీన్ పై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌లో బీసీ పొలిటికల్ జేఏసీ ఫిర్యాదు చేసింది. జింఖానా ఘటనకు అజారుద్దీన్ దే బాధ్యత అని ఫిర్యాదులో పేర్కొంది.