India vs Sri Lanka: సూర్య కుమార్, అక్షర్ పోరాటం వృథా…. పోరాడి ఓడిన భారత్

పూణే వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ లో టీమిండియా పోరాడి ఓడింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో లంక 16 రన్స్ తేడాతో విజయం సాధించింది.

  • Written By:
  • Updated On - January 6, 2023 / 12:08 AM IST

పూణే వేదికగా జరిగిన రెండో టీ ట్వంటీ లో టీమిండియా పోరాడి ఓడింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన పోరులో లంక 16 రన్స్ తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన శ్రీలంక 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఆరంభం నుంచే ఆ జట్టు బ్యాటర్లు భారీ షాట్లతో విరుచుకు పడ్డారు. తొలి వికెట్ కి 80 పరుగులు జోడించారు. వీరి పార్టనర్ షిప్ విడిపోయినా చివర్లో కెప్టెన్ శనక మెరుపులు మెరిపించాడు. అసలంక తో కలిసి భారీ షాట్లతో రెచ్చిపోయాడు. దీంతో లంక స్కోర్ 200 దాటింది. శనక జోరుతో లంక స్కోర్ టాప్ గేర్ లో దూసుకెళ్లింది.ముఖ్యంగా శివమ్ మావి వేసిన చివరి ఓవర్లు 3 సిక్సర్లు సహా 20 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలో తన అర్ధశతకం కూడా పూర్తి చేసుకున్నాడు. 22 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు.

207 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ఇషాన్(2), శుబ్‌మన్ గిల్‌ను(5) రాహుల్ త్రిపాఠిని(5) పరుగులకు ఔటవడంతో భారత్ 21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కాసేపటికీ కెప్టెన్ హార్దిక్ పాండ్య, దీపక్ హుడా కూడా ఔటయ్యారు. దీంతో 57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో అక్షర్ పటేల్, సూర్యకుమార్ అదరగొట్టారు. తక్కువ పరుగులకే వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు. వరుసగా మూడు ఓవర్లలో శ్రీలంక బౌలర్లపై ఎదురుదాడికి దిగి స్కోరు వేగాన్ని పెంచారు. ముఖ్యంగా హసరంగా వేసిన బౌలింగ్‌లో అక్షర్ 3 సిక్సర్లు బాదగా.. మొత్తం ఆ ఓవర్‌లో 26 పరుగులు వచ్చాయి. ఈ క్రమంలోనే వీరిద్దరూ అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. ధాటిగా ఆడుతూ టీమిండియాను గెలుపు అంచున నిలిపారు. అయితే వీరిద్దరూ కీలక సమయంలో వెనుదిరగడంతో భారత్ కి ఓటమి తప్పలేదు. చివరి ఓవర్లో విజయానికి 21 పరుగులు అవసరం కాగా.. భారత్ 5 పరుగులు మాత్రమే చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో దసున్ శనకా, కసున్ రజితా, దిల్షాన్ మధుశనకా తలో రెండు వికెట్లు తీశారు. ఈ విజయంతో సీరీస్ ను శ్రీలంక సమం చేసింది.