India Beats WI: అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్…సీరీస్ భారత్ దే

కరేబియన్ టూర్ లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది.

  • Written By:
  • Publish Date - July 25, 2022 / 09:55 AM IST

కరేబియన్ టూర్ లో మరో ఉత్కంఠ పోరు అభిమానులను అలరించింది. భారీ లక్ష్య చేదనలో వికెట్లు కోల్పోయినా టైయిలెండర్లుతో కలిసి ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ మెరుపు ఇన్నింగ్స్ ఆడి అద్భుత విజయాన్ని అందించాడు. ఫలితంగా విండీస్ గడ్డపై వన్డే సిరీస్ భారత సొంతమయింది.

రెండో వన్డేలోనూ టాస్ గెలిచిన వెస్టిండీస్ ఈ సారి బ్యాటింగ్ ఎంచుకుంది. ఊహించినట్టు గానే భారత్ ప్రసిధ్‌ కృష్ణ స్థానంలో అవేశ్‌ ఖాన్‌ జట్టులోకి తీసుకుంది. దీంతో భారత్‌ తరఫున వన్డేల్లో అరంగేట్రం చేసిన 244వ క్రికెటర్‌గా రికార్డుల కెక్కాడు. ఈ మ్యాచ్ లోనూ భారత్ బౌలింగ్ పేలవంగా సాగింది. ఎవరూ పెద్దగా ప్రభావం చూపలేక పోవడంతో కరీబియన్లు మళ్లీ ఓ ఆటాడుకున్నారు. మన పేలవ బౌలింగ్ కారణంగానే వరుసగా రెండో మ్యాచ్ లోనూ వెస్టిండీస్‌ 300 పైచిలుకు స్కోరు చేయగలిగింది. కెరీర్‌లో 100వ వన్డే ఆడుతున్న ఓపెనర్‌ షై హోప్‌ సెంచరీతో చెలరేగాడు. తొలి బంతి నుంచి 49వ ఓవర్‌దాకా విండీస్‌ ఇన్నింగ్స్‌కు వెన్నెముకగా నిలిచాడు. హోప్ 135 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 118 రన్స్ చేశాడు. కెప్టెన్‌ నికోలస్‌ పూరన్‌ కూడా హాఫ్ సెంచరీతో రాణించాడు. టాపార్డర్ కీలక పార్టనర్ షిప్ సాయంతో
వెస్టిండీస్‌ 6 వికెట్లకు 311 పరుగులు చేసింది. పూరబ్ 77 బంతుల్లో 74 రన్స్ చేయగా… భారత బౌలర్లలో శార్దుల్‌ ఠాకూర్‌ 3 వికెట్లు తీశాడు.

భారీ లక్ష్య ఛేదనలో భారత్ కు ఈ సారి మెరుపు ఆరంభం దక్కలేదు. తొలి వన్డేలో తృటిలో సెంచరీ కోల్పోయిన కెప్టెన్ శిఖర్ ధావన్ ఈసారి విఫలమయ్యాడు. శుభమన్ గిల్ 49 బంతుల్లో 43 , సూర్యకుమార్ యాదవ్ స్వల్ప వ్యవధిలోనే ఔటవడంతో భారత్ 79 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్ జట్టును ఆదుకున్నారు. సంజూ శాంసన్ 51 బంతుల్లో 54, శ్రేయాస్ అయ్యర్ 71 బంతుల్లో 63 చేశారు. వీరిద్దరూ ఔటయ్యాక విండీస్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో సాధించాల్సిన రన్ రేట్ పెరిగిపోయింది. చివరి పది ఓవర్లలో 100 రన్స్ చేయాల్సి ఉండగా దీపక్ హుడా, అక్షర్ పటేల్ దూకుడుగా ఆడారు. విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించిన అక్షర్ పటేల్ ఎడాపెడా బౌండరీలు బాదాడు. ఈ క్రమంలో కేవలం 27 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. దీపక్ హుడా, శార్దూల్ వెంట వెంటనే ఔటైనా పట్టు వీడని అక్షర్ జట్టును గెలిపించాడు. బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన సమయంలో అక్షర్‌ పటేల్‌ సిక్సర్‌ బాది భారత జట్టుకు విజయాన్ని అందించాడు. అక్షర్‌ పటేల్‌ 35 బంతుల్లో 64 రన్స్ తో అజెయంగా నిలిచాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్‌ మిగిలుండగానే 2-0తో టీమిండియా దక్కించుకుంది.