Site icon HashtagU Telugu

DC vs SRH: బౌలింగ్ అదుర్స్…బ్యాటింగ్ బెదుర్స్ ఢిల్లీ చేతిలో ఓడిన హైదరాబాద్

Delhi Capitals

Delhi Capitals

DC vs SRH: నిలకడ లేని బ్యాటింగ్ మరోసారి సన్ రైజర్స్ హైదరాబాద్ కొంపముంచింది. సొంత గడ్డపై ఓ మాదిరి టార్గెట్ చేదించలేక చేతులు ఎత్తేసింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ 7 పరుగుల తేడాతో హైదరాబాద్ పై విజయం సాధించింది. బౌలింగ్ లో అదరగొట్టిన సన్ రైజర్స్ బ్యాటింగ్ వైఫల్యంతో చేజేతులా ఓటమి చవిచూసింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు తొలి ఓవర్‌లోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్‌ను భువనేశ్వర్‌ పెవిలియన్‌కు పంపాడు.

తర్వాత కెప్టెన్ డేవిడ్ వార్నర్, మిఛెల్ మార్ష్ ఆదుకునే ప్రయత్నం చేశారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 38 పరుగులు జోడించారు. మార్ష్ 15 బంతుల్లోనే 25 రన్స్ చేయగా..వార్నర్ 20 బంతుల్లో 21 రన్స్‌కు ఔటయ్యాడు. వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటైన తర్వాత ఢిల్లీ ఇన్నింగ్స్ అనూహ్యంగా కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ ఢిల్లీని దెబ్బతీశారు. ఒకే ఓవర్‌లో వార్నర్, సర్ఫ్‌రాజ్‌ఖాన్, హఖీమ్ ఖాన్‌లను ఔట్ చేశాడు.

ఈ దశలో మనీశ్ పాండే, అక్షర్ పటేల్ ఢిల్లీని ఆదుకున్నారు. వీరిద్దరూ ఆరో వికెట్‌కు 69 పరుగులు జోడించడంతో స్కోర్ 130 దాటింది. అయితే చివర్లో వరుస రనౌట్లు ఢిల్లీని దెబ్బతీశాయి. మనీశ్ పాండే 34 , అక్షర్ పటేల్ 34 పరుగులు చేయగా..ముగ్గురు బ్యాటర్లు రనౌటయ్యారు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 144 పరుగులు చేసింది. సన్‌రైజర్స్ బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, భువనేశ్వర్ 2 , నటరాజన్ 1 వికెట్ పడగొట్టారు.

బ్యాటింగ్ పిచ్ పై 145 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హైదరాబాద్ కు గొప్ప ఆరంభం లభించలేదు. బ్రూక్ మరోసారి విఫలమవగా సన్ రైజర్స్ 31 రన్స్ కే తొలి వికెట్ కోల్పోయింది. మయాంక్ అగర్వాల్ , రాహుల్ త్రిపాఠి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశారు. త్రిపాఠి ఔట్ అయినా…మయాంక్ అగర్వాల్ ధాటిగా ఆడడంతో హైదరాబాద్ ఇన్నింగ్స్ సాఫీగా సాగింది. అయితే కీలక సమయంలో వరుస వికెట్లు కోల్పోయింది.

మయాంక్ అగర్వాల్ 49 రన్స్ చేయగా…అభిషేక్ శర్మ, కెప్టెన్ మక రమ్ నిరాశ పరిచారు. అయితే చివర్లో వికెట్ కీపర్ క్లాసెన్ మెరుపులు మెరిపించడంతో మ్యాచ్ మళ్లీ ఆసక్తికరంగా మారింది. క్లాసెన్ 31 రన్స్ కు ఔటయ్యాక…వాషింగ్టన్ సుందర్ ధాటిగా ఆడి గెలిపించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. దీంతో సన్ రైజర్స్ హైదరాబాద్ 137 పరుగులకు పరిమితమయింది.

Exit mobile version