Khan Strikes: నమ్మకాన్ని నిలబెట్టుకున్న అవేశ్‌ఖాన్‌

వరుసగా మూడు టీ ట్వంటీల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా భారీగానే పరుగులు ఇచ్చేశాడు..ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్‌ అతనిపై నమ్మకముంచింది

  • Written By:
  • Publish Date - June 17, 2022 / 11:57 PM IST

వరుసగా మూడు టీ ట్వంటీల్లో ఒక్క వికెట్ కూడా తీయలేదు.. పైగా భారీగానే పరుగులు ఇచ్చేశాడు..ఇలాంటి పరిస్థితుల్లో టీమ్ మేనేజ్‌మెంట్‌ అతనిపై నమ్మకముంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు యువ పేసర్ అవేశ్ ఖాన్‌. కీలకమైన నాలుగో టీ ట్వంటీలో 4 వికెట్లతో సౌతాఫ్రికా పతనాన్ని శాసించాడు. ఫలితంగా సిరీస్‌ను సమం చేయడమే కాదు తన బౌలింగ్ సత్తా కూడా నిరూపించుకున్నాడు.
వచ్చే టీ ట్వంటీ వరల్డ్‌కప్‌కు భారత జట్టు కూర్పును పరీక్షించే ఉద్ధేశంతో సౌతాఫ్రికాతో సిరీస్‌కు పలువురు యువక్రికెటర్లకు సెలక్టర్లు అవకాశమిచ్చారు. ఈ సిరీస్‌లో సత్తా చాటితే దాదాపుగా ప్రపంచకప్‌ జట్టులో బెర్త్ దక్కించుకునే అవకాశముంటుంది. దీంతో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు యువక్రికెటర్లు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఐపీఎల్‌లో సత్తా చాటిన యువపేసర్ అవేశ్‌ఖాన్‌ సౌతాఫ్రికాపైనా చెలరేగుతాడని అంతా భావించారు.

అయితే తొలి మూడు టీ ట్వంటీల్లో అవేశ్‌ఖాన్ నిరాశపరిచాడు. ఒక్క వికెట్ కూడా తీయకపోగా భారీగానే పరుగులు ఇచ్చేశాడు. దీంతో నాలుగో టీ ట్వంటీకి అతను తుది జట్టులో కొనసాగడం కష్టమేనని అంచనా వేశారు. అయితే కోచ్ రాహుల్ ద్రావిడ్ అవేశ్‌ఖాన్‌పై నమ్మకముంచి మరో అవకాశమిచ్చాడు. ప్లేయర్ సత్తాను అంచనా వేయడంలో దిట్టగా పేరున్న ద్రావిడ్ నమ్మకం వమ్ము కాలేదు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని అవేశ్‌ఖాన్ నిలబెట్టుకున్నాడు.

నిజానికి రాజ్‌కోట్ టీ ట్వంటీ భారత్‌కు డూ ఆర్ డై మ్యాచ్. ఎందుకంటే విశాఖలో గెలిచినప్పటకీ నాలుగో మ్యాచ్‌లో ఓడితే సిరీస్ చేజారిపోవడం ఖాయం. దీనికి తోడు ఆరంభంలోనే మన బ్యాటర్లు తడబాటు.. తర్వాత పాండ్యా, దినేశ్ కార్తీక్ రాణించడంతో 169 పరుగులు చేయగలిగింది. బ్యాటింగ్ పిచ్ కావడంతో ఈ స్కోరును కాపాడుకోవడం కాస్త కష్టమే. ఇటువంటి పరిస్థితుల్లో ఒత్తిడిలో ఉన్న అవేశ్‌ఖాన్‌ అద్భుతంగా రాణించాడు.

మొదటి మూడు మ్యాచ్‌లలో తన పేలవ ప్రదర్శన మరిచిపోయేలా అదరగొట్టాడు. కీలకమైన డస్సెన్, ప్రిటోరియస్ వికెట్లను ఆరంభంలోనే పడగొట్టి భారత్‌కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. చివర్లో కూడా మరో రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా ఈ మ్యాచ్‌లో అవేశ్‌ఖాన్ తన 4 ఓవర్ల కోటాలో 18 పరుగులే ఇచ్చి 4 వికెట్లు తీసుకున్నాడు.

ఐపీఎల్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ప్రాతినిథ్యం వహించిన అవేశ్‌ఖాన్‌ ఆ జట్టు తరపున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా నిలిచాడు. సీజన్ మొత్తం నిలకడగా రాణించిన ఈ యువపేసర్ 18 వికెట్లు పడగొట్టాడు. ఈ ప్రదర్శనతోనే సెలక్టర్లను ఆకర్షించిన అవేశ్‌ఖాన్ సఫారీతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. మొదటి మూడు మ్యాచ్‌లలో విఫలమైనా… కీలకమైన నాలుగో టీ ట్వంటీలో సత్తా చాటడం ద్వారా అవకాశాన్ని నిలబెట్టుకున్నాడు.