Para Shooting World Cup 2022 : షూటింగ్ వరల్డ్ కప్ లో అవని ప్రపంచ రికార్డ్

గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన షూటర్‌ అవని లెఖారా అంతర్జాతీయ స్థాయిలో తన జోరు కొనసాగిస్తోంది.

Published By: HashtagU Telugu Desk
Avani Lekhara

Avani Lekhara

గతేడాది జరిగిన పారాలింపిక్స్‌లో స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన షూటర్‌ అవని లెఖారా అంతర్జాతీయ స్థాయిలో తన జోరు కొనసాగిస్తోంది. ఆమె తాజాగా ఫ్రాన్స్‌లో జరుగుతున్న పారా వరల్డ్‌కప్‌లో ప్రపంచ రికార్డ్‌ నమోదు చేసింది. 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాండింగ్‌ ఎస్‌హెచ్‌1 ఈవెంట్‌లో 250.6 స్కోరు సాధించడం ద్వారా గతంలో తాను నెలకొల్పిన రికార్డును తానే బ్రేక్‌ చేసింది. ఈ వరల్డ్‌ రికార్డ్‌, గోల్డ్‌ మెడల్‌తో ఆమె 2024 పారిస్‌ పారాలింపిక్స్‌కు అర్హత సాధించింది. నిజానికి అవని అసలు పోటీలలో పాల్గొంటుందో లేదో అన్న సందేహం కలిగింది. అవని కోచ్‌తోపాటు ఆమె ఎస్కార్ట్‌కు వీసాలు ఇవ్వడానికి నిరాకరించాడమే దీనికి కారణం. అయితే కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా జోక్యంతో వాళ్లకు వీసాలు జారీ అయ్యాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఆమె 10 మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో పాల్గొనడం, ఏకంగా వరల్డ్‌ రికార్డుతో గోల్డ్ మెడల్ సాధించడం గొప్ప ప్రదర్శనగా చెప్పొచ్చు. ఇండియాకు గోల్డ్ మెడల్‌ తీసుకురావడం, 2024 పారిస్‌ పారాలింపిక్స్‌కు క్వాలిఫై అయిన తొలి ఇండియన్‌ అథ్లెట్‌గా నిలవడం గర్వంగా ఉందని విజయం తర్వాత అవని ట్వీట్‌ చేసింది. పారాలింపిక్స్‌ తర్వాత తాను పార్టిసిపేట్‌ చేసిన తొలి ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌ ఇదేనని, తనకు సపోర్ట్‌ అందరికీ కృతజ్ఞతలు అని చెప్పింది. గతేడాది ఆగస్ట్‌లో అవని లెఖారా టోక్యో పారాలింపిక్స్‌ ఎస్‌హెచ్‌ 1 కేటగిరీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌ స్టాండింగ్‌ ఈవెంట్‌లోనూ గోల్డ్‌ మెడల్ గెలుచుకుంది. అదే పారాలింపిక్స్‌లో 50 మీటర్ల రైఫిల్‌ 3 పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌ 1 ఈవెంట్‌లో కాంస్యం సాధించింది. ఇలా పారాలింపిక్స్‌లో ఒకటి కంటే ఎక్కువ మెడల్స్‌ గెలుచుకున్న తొలి ఇండియన్‌గానూ రికార్డు సృష్టించింది.

  Last Updated: 08 Jun 2022, 01:35 PM IST