Site icon HashtagU Telugu

Australia vs India: ఆస్ట్రేలియాదే వన్డే సీరీస్.. బ్యాటింగ్ వైఫల్యంతో ఓడిన భారత్

Australia Won Odi Series .. India Lost To Batting Failure

Australia Won Odi Series .. India Lost To Batting Failure

భారత్ తో జరిగిన వన్డే సిరీస్ ను ఆస్ట్రేలియా (Australia) కైవసం చేసుకుంది. చెన్నై వేదికగా జరిగిన చివరి వన్డేలో సమిష్టిగా రాణించిన ఆసీస్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. కంగారూల తోక తెంచలేక బౌలర్లు చతికలపడితే.. మరోసారి బ్యాటర్లు విఫలమవడంతో సీరీస్ చేజారింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆసీస్ ఊహించినట్టుగానే బ్యాటింగ్ ఎంచుకుంది. ఆ జట్టు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 68 రన్స్ జోడించారు. అయితే హార్థిక్ పాండ్యా వరుస ఓవర్లలో హెడ్, మార్ష్ లను ఔట్ చేసాడు. మార్ష్ 47 ( 8 ఫోర్లు, 1 సిక్సర్ ) , హెడ్ 33 (4 ఫోర్లు,2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా…గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన వార్నర్ , లబూషేన్ తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మరోవైపు స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూడా తన మ్యాజిక్ చూపించడంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది.

ఆసీస్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా మన బౌలర్లు అడ్డుకోగలిగారు. దీంతో ఆసీస్ 203 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. అయితే లోయర్ ఆర్డర్ ను త్వరగా ఔట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆసీస్ తోక తెంచలేకపోవడంతో ఆ జట్టు స్కోర్ 250 దాటగలిగింది. చివర్లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పట్టుదలగా ఆడడం ఆసీస్ మంచి స్కోరు సాధించడంలో కీలకమైంది. ఆసీస్ ఇన్నింగ్స్ ఒక్క హాఫ్ సెంచరీ లేకున్నా ఇంత మంచి స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో పాండ్యా 3 , కుల్ దీప్ యాదవ్ 3 , సిరాజ్ 2 , అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

270 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ కూడా ధాటిగానే ఆడింది. తొలి వికెట్ కు ఓపెనర్లు గిల్ , రోహిత్ శర్మ 9.1 ఓవర్లలోనే 65 రన్స్ జోడించారు. రోహిత్ 17 బంతుల్లో 30 రన్స్ చేయగా…గిల్ 37 పరుగులకు ఔట్ అయ్యాడు. వీరిద్దరూ ఔటైనా కోహ్లీ , కే ఎల్ రాహుల్ మూడో వికెట్ కు 69 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో కోహ్లీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా (Australia) స్పిన్నర్ల రాకతో పరిస్థితి మారిపోయింది. భారీ షాట్లకు ప్రయత్నించి వికెట్లు పారేసుకున్నారు. కోహ్లీ 54 , కే ఎల్ రాహుల్ 32 రన్స్ కు వెనుదిరిగారు. బ్యాటింగ్ ఆర్డర్ లో అక్షర్ పటేల్ ను ముందు పంపినా ప్రయోగం ఫలితం ఇవ్వలేదు. అయితే హార్థిక్ పాండ్య , జడేజా పార్టనర్ షిప్ తో మ్యాచ్ గెలుచుకునేలా కనిపించింది. వీరి పార్టనర్ షిప్ ను కీలక సమయంలో ఆసీస్ బ్రేక్ చేయడం మ్యాచ్ ను మలుపు తిప్పింది. హార్దిక్ 40 రన్స్ చేయగా..తర్వాత భారత్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టలేదు. చివరికి భారత్ 248 పరుగులకు ఆలౌట్ అయింది. ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా 4 , అగర్ 2 వికెట్లు పడగొట్టారు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ ను ఆస్ట్రేలియా 2-1 తో కైవసం చేసుకుంది. తద్వారా భారత్ టూర్ ను సీరీస్ విజయంతో ముగించింది.

Also Read:  KCR @ Maharashtra: మహారాష్ట్ర లో కేసీఆర్ మరో సభ, 26న లక్ష మందితో..