IND vs AUS T20: సెప్టెంబర్ లో భారత్ టూర్ కు ఆసీస్

ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనుండడంతో ప్రతీ జట్టూ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగించుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపైనా స్పష్టత ఉండే విధంగా సిరీస్ లు ప్లాన్ చేసుకుంటున్నాయి.

  • Written By:
  • Publish Date - May 10, 2022 / 03:01 PM IST

ఈ ఏడాది టీ ట్వంటీ ప్రపంచకప్ జరగనుండడంతో ప్రతీ జట్టూ వీలైనన్ని ఎక్కువ మ్యాచ్ లు ఆడేందుకు సిద్ధమయ్యాయి. మెగా టోర్నీకి ముందు సన్నాహకంగా ఉపయోగించుకోవడంతో పాటు తుది జట్టు కూర్పుపైనా స్పష్టత ఉండే విధంగా సిరీస్ లు ప్లాన్ చేసుకుంటున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా కూడా టీ ట్వంటీ వరల్డ్ కప్ కు ముందు భారత్ తో మూడు మ్యాచ్ ల సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్‌లో ఆరోన్ ఫించ్ సారథ్యంలోని ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ ఏడాది చివర్లో ఆస్ట్రేలియా వేదికగా టీ 20 వరల్డ్ కప్ జరగనుండగా.. దానికి సన్నాహాకంగా భారత్ తో సిరీస్ ను వినియోగించుకోవాలని ఆసీస్ జట్టు నిర్ణయంచింది. ఈ సిరీస్ కు ముందే శ్రీలంక , జింబాబ్వే , న్యూజిలాండ్ జట్లతో ఆడనుండగా… మెగా టోర్నీకి ముందు మాత్రం టీమిండియా లాంటి పటిష్ట జట్టుతో తలపడితేనే సరైన ప్రిపరేషన్ ఉంటుందనేది ఆసీస్ బోర్డు ఆలోచన. తొలుత జూన్ చివరి వారంలో ఆస్ట్రేలియా జట్టు శ్రీలంక పర్యటనకు వెళ్లనుండగా.. అక్కడ 3 టీ20లు, 3వన్డేలు 2 టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్ లో తలపడనుంది. అనంతరం ఆగస్టు నుంచి సెప్టెంబర్ తొలి వారం వరకు జింబాబ్వే, న్యూజిలాండ్‌ జట్లతో వన్డే సిరీస్‌లలో పోటీపడుతుంది. ఆ తర్వాత సెప్టెంబర్ రెండోవారం నుంచి భారత పర్యటన ఆసీస్ జట్టు రానుంది.

మరోవైపు భారత్ కూడా మెగా టోర్నీకి ముందు వరుస సిరీస్ లతో బిజీగా గడపనుంది. ఐపీఎల్‌ 15వ సీజన్ ముగిసిన వెంట‌నే భారత క్రికెట్ జట్టు సొంతగడ్డపై ద‌క్షిణాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ల ఆడ‌నుంది. ఈ సిరీస్ జాన్ 9న ప్రారంభం కానుండగా.. జూన్ 19న ముగియ‌నుంది. రెండు జట్ల మధ్య తొలి రెండు టీ20లు ఢిల్లీ, క‌ట‌క్‌లు వేదిక‌గా జరగనుండగా..మూడో టీ20 విశాఖలో చివరి రెండు టీ20లు రాజ్‌కోట్‌, బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. ఇక సిరీస్ ముగిసాక టీమిండియా ఇంగ్లండ్, వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లకు వెళ్ల‌నుంది. గ‌తేడాది ఐదు టెస్టుల సిరీస్‌లో వాయిదా ప‌డిన టెస్టును ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడ‌నుండగా.. వెస్టిండీస్ తో 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లో పోటీపడనుంది. ఇక విండీస్ తో సిరీస్ లో భాగంగా ట్రినిడాడ్‌లోని క్వీన్స్ పార్క్ ఓవల్‌ మైదానం వేదికగా జూలై 22, 24, 27 తేదీల్లో మూడు వన్డేలు జరుగనున్నాయి. ఆ ఆ తరువాత జూలై 29న తొలి టీ20, ఆగస్టు 1, 2 తేదీల్లో రెండు, మూడు టీ20లు, ఆగస్టు 6, 7 తేదీల్లో ఆఖరి రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి.