Site icon HashtagU Telugu

Finch Retaires Odi : వన్డే క్రికెట్‌కు ఫించ్ గుడ్‌బై..!!

Finch

Finch

ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించాడు. రేపు న్యూజిలాండ్‌తో జరిగే వన్డే తన కెరీర్‌లో చివరిదిగా చెప్పాడు. టీ ట్వంటీలపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. గత కొంత కాలంగా వన్డేల్లో ఫించ్ పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. గత ఏడు ఇన్నింగ్స్‌లలో కేవలం 26 పరుగులే చేశాడు. వాటిలో రెండు డకౌట్‌లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకూ 145 వన్డేలు ఆడిన ఫించ్ 5041 పరుగులు చేశాడు. 54 వన్డేల్లో ఆసీస్‌కు సారథిగా వ్యవహరించాడు. ఫించ్ వన్డే కెరీర్‌లో 17 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

2013లో శ్రీలంకపై ఆసీస్‌ తరపున వన్డేల్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. 2015 వన్డే ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఆరోన్ ఫించ్ కెప్టెన్సీలో 2021 టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఆస్ట్రేలియా… 2019 వన్డే వరల్డ్ కప్‌లో సెమీ ఫైనల్‌ చేరింది. కెప్టెన్‌గా టీ20ల్లో 65 మ్యాచులు ఆడి 35 విజయాలు అందుకున్న ఆరోన్ ఫించ్, 52 వన్డేల్లో 28 విజయాలు అందించాడు.

ఇదిలా ఇంటే బాగా ఆలోచించే వన్డే రిటైర్మెంట్ తీసుకున్నట్టు ఫించ్ చెప్పుకొచ్చాడు. ఆస్ట్రేలియా వంటి అద్భుతమైన జట్టులో భాగమైనందుకు తాను చాలా అదృష్టవంతుడిని పేర్కొన్నాడు. ఆసీస్‌ జట్టుతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన క్రికెట్‌ ఆస్ట్రేలియా, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపాడు.