Site icon HashtagU Telugu

World Cup : వరల్డ్‌కప్‌లో ఆస్ట్రేలియా బోణీ.. లంకపై గెలిచిన కంగారూలు

Australia

Australia

వన్డే ప్రపంచకప్‌లో ఎట్టకేలకు ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. ఆడిన రెండు మ్యాచ్‌లలో ఓడిన కంగారూలు మూడో మ్యాచ్‌లో విజయాన్ని రుచి చూశారు. లక్నో వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక తక్కువ స్కోరుకే పరిమితమైంది. ఓపెనర్లు మెరుపు ఆరంభాన్నిచ్చినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో అనూహ్యంగా కుప్పకూలింది. ఓపెనర్లు నిస్సంక, కుశాల్ పెరీరా హాఫ్ సెంచరీతో అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్‌కు 21.4 ఓవర్లలోనే 125 పరుగులు జోడించారు. అయితే కమ్మిన్స్‌ వీరిద్దరినీ వరుసగా ఔట్ చేయడంతో ఆసీస్ పట్టుబిగించింది. కుశాల్ పెరీరా 82 బంతుల్లో 12 ఫోర్లతో 78 రన్స్ చేయగా.. నిస్సంక 67 బంతుల్లో 8 ఫోర్లతో 61 పరుగులు చేసాడు. అయితే అంచనాలు పెట్టుకున్న కుశాల్ మెండిస్ , సమరవిక్రమ నిరాశపరిచారు. అసలంక 25 పరుగులు చేసినా… మిగిలిన బ్యాటర్లలో ఏ ఒక్కరూ డబుల్ డిజిట్ స్కోర్ సాధించలేకపోయారు. ఫలితంగా శ్రీలంక 209 పరుగులకే ఆలౌటైంది. లంక 52 పరుగుల తేడాలో 8 వికెట్లు చేజార్చుకుంది. ఆసీస్ బౌలర్లలో స్పిన్నర్ 4 వికెట్లు పడగొట్టగా…మిఛెల్ స్టార్క్ 2, కమ్మిన్స్ 2, మాక్స్‌వెల్ 1 వికెట్ తీసారు.

We’re now on WhatsApp. Click to Join.

ఛేజింగ్‌లో ఆస్ట్రేలియా కూడా తడబడింది. డేవిడ్ వార్నర్ మరోసారి నిరాశపరిచాడు. కేవలం 11 రన్స్‌కే ఔటవగా.. స్మిత్ డకౌటయ్యాడు. అయితే మిఛెల్ మార్ష్ హాఫ్ సెంచరీతో రాణించాడు. లబూషేన్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 77 పరుగుల పార్టనర్‌షిప్ నెలకొల్పాడు. లబూషేన్ 40 పరుగులకు ఔటవగా.. మిఛెల్ మార్ష్ 51 బంతుల్లో 9 ఫోర్లతో 52 రన్స్‌ చేశాడు. తర్వాత జోష్ ఇంగ్లిస్ కూడా హాఫ్ సెంచరీతో రాణించి ఆసీస్‌ను విజయానికి చేరువ చేశాడు. ఇంగ్లిస్ 58 పరుగులకు ఔటైనప్పటకీ.. మాక్స్‌వెల్, స్టోయినిస్ ఆసీస్ విజయాన్ని పూర్తి చేశారు. దీంతో ఆసీస్‌ 35.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. ఈ ప్రపంచకప్‌లో ఆసీస్‌కు ఇదే తొలి విజయం. అంతకుముందు భారత్ , సౌతాఫ్రికాలతో జరిగిన రెండు మ్యాచ్‌లల్లోనూ ఓడిపోయింది. లంకపై విజయంతో పాయింట్ల పట్టికలో ఆసీస్ ఖాతా తెరిచింది. మరోవైపు శ్రీలంకకు వరుసగా ఇది మూడో పరాజయం.

Also Read:  Mimoh Chakraborty: టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్న బాలీవుడ్ హీరో కుమారుడు.. ఎవరో తెలుసా