Site icon HashtagU Telugu

Aus vs IND: తోక తెంచలేకపోయారు… చెన్నై వన్డేలో భారత్ టార్గెట్ 270

Whatsapp Image 2023 03 22 At 19.10.45

Whatsapp Image 2023 03 22 At 19.10.45

Aus vs IND: సిరీస్ ఫలితాన్ని తేల్చే చెన్నై వన్డేలో ఆస్ట్రేలియా మంచి స్కోరే సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ 269 పరుగులకు ఆలౌటైంది. నిజానికి ఆసీస్ ఓపెనర్ల మెరుపు ఆరంభాన్ని చూస్తే ఆ జట్టు 300 కంటే ఎక్కువ స్కోర్ చేస్తుందనిపించింది. ఓపెనర్లు హెడ్ , మిఛెల్ మార్ష్ తొలి వికెట్ కు 10.5 ఓవర్లలోనే 68 పరుగులు జోడించారు. మొదటి పవర్ ప్లేలో వీరిద్దరూ ఎటాకింగ్ బ్యాటింగ్ తో దూకుడుగా ఆడారు. అయితే హార్థిక్ పాండ్యా వరుస ఓవర్లలో హెడ్ , మార్ష్ లను ఔట్ చేసి భారత్ కు బ్రేక్ త్రూ ఇచ్చాడు. మార్ష్ 47 ( 8 ఫోర్లు, 1 సిక్సర్ ) , హెడ్ 33 (4 ఫోర్లు,2 సిక్సర్లు) పరుగులకు ఔటవగా…గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన వార్నర్ , లబూషేన్ తో కలిసి కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకున్నాడు. మరోవైపు స్పిన్నర్ కుల్ దీప్ యాదవ్ కూడా తన మ్యాజిక్ చూపించడంతో ఆసీస్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆసీస్ బ్యాటర్లు భారీ భాగస్వామ్యాలు నెలకొల్పకుండా మన బౌలర్లు అడ్డుకోగలిగారు. దీంతో ఆసీస్ 203 పరుగులకు 7 వికెట్లు కోల్పోయింది. అయితే లోయర్ ఆర్డర్ ను త్వరగా ఔట్ చేయడంలో భారత బౌలర్లు విఫలమయ్యారు. ఆసీస్ తోక తెంచలేకపోవడంతో ఆ జట్టు స్కోర్ 250 దాటగలిగింది.

చివరి ముగ్గురు బ్యాటర్లు 60 పరుగులకు పైగా చేయడం విశేషం. వార్నర్ 23 , లబూషేన్ 28 , అలెక్స్ క్యారీ 38, స్టోయినిస్ 25 పరుగులు చేశారు. చివర్లో ఆసీస్ లోయర్ ఆర్డర్ బ్యాటర్లు పట్టుదలగా ఆడడం ఆసీస్ మంచి స్కోరు సాధించడంలో కీలకమైంది. సీన్ ఎబోట్ 26, అగర్ 17, స్టార్క్ 10 తమ స్థాయికి తగినట్టు ఆడడంతో ఆస్ట్రేలియా 269 పరుగులు చేయగలిగింది. ఆసీస్ ఇన్నింగ్స్ ఒక్క హాఫ్ సెంచరీ లేకున్నా ఇంత మంచి స్కోర్ సాధించింది. భారత బౌలర్లలో పాండ్యా 3 , కుల్ దీప్ యాదవ్ 3 , సిరాజ్ 2 , అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.