Women’s T20 World Cup Final : మహిళల టీ ట్వంటీ క్రికెట్‌లో వరల్డ్ ఛాంపియన్ ఎవరో ఇవాళ తేలిపోనుంది. అంచనాలకు తగ్గట్టే ఫైనల్ చేరిన ఆస్ట్రేలియా ఒకవైపు.. తొలిసారి టైటిల్ పోరుకు అర్హత సాధించిన సౌతాఫ్రికా మరోవైపు కప్ కొట్టేందుకు సై అంటున్నాయి. ప్రస్తుత ఫామ్, గత రికార్డుల పరంగా ఆసీస్‌నే ఫేవరెట్‌గా భావిస్తున్నారు. అయితే సొంతగడ్డపై సత్తా చాటుతున్న సఫారీలను తేలిగ్గా తీసుకోలేం. పురుషుల క్రికెట్‌లో కూడా సౌతాఫ్రికాకు ఫైనల్ చేరిన చరిత్ర లేదు. దీంతో మహిళల టీట్వంటీ ప్రపంచకప్ టైటిల్ పోరుకు సిద్ధమైన తమ జట్టును ప్రోత్సహించేందుకు సఫారీ అభిమానులు ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో సత్తా చాటి తుది పోరుకు వచ్చిన ఆ జట్టు ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని భావిస్తోంది. అయితే ఫైనల్లో ఆసీస్‌ను ఓడించాలంటే సఫారీలు అంచనాలకు మించి రాణించాల్సిందే. ఎందుకంటే ఆసీస్ ఐదుసార్లు చాంపియన్ నిలిచింది. ఈ టోర్నీ లో ఆసీస్ ఆటతీరు చూస్తే వారి ఆధిపత్యం మరోసారి అంగీకరించాల్సిందే. ఎందుకంటే
ఆ జట్టు ఏ ఒక్కరిపైనో ఆధారపడకుండా సమిష్టిగా, పరిస్థితులకు తగ్గట్టు ఆడుతూ ఆరోసారి టైటిల్‌పై కన్నేసింది. బ్యాటింగ్‌లో అలీసా హీలీ, బెత్ మూనీ చెరో తాలియా మెక్‌గ్రాత్, కెప్టెన్ మెగ్ లానింగ్ కీలక సమయాల్లో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌లతో అదరగొడుతున్నారు. బౌలింగ్‌లో మెగాన్ షుట్ , డార్సీ బ్రౌన్, వేర్‌హమ్ ప్రత్యర్థి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్నారు. వీరితో పాటు ఆల్‌రౌండర్లు గార్డ్‌నర్, ఎలీస్ పెర్రీ నిలకడగా రాణిస్తుండడం ఆసీస్‌కు ఆడ్వాంటేజ్
మరోవైపు లీగ్ స్టేజ్ నుంచి అనూహ్యంగా నాకౌట్ చేరిన సౌతాఫ్రికా సెమీస్‌లో అదరగొట్టింది. స్ఫూర్తి దాయకమైన ఆటతీరుతో ఇంగ్లాండ్‌కు షాక్ ఇచ్చింది. నిర్ణీత 20 ఓవర్లలో 164 పరుగులే చేశారు. ఇంగ్లాండ్ కు ఇదేం పెద్ద లక్ష్యం కాదు. అయితే దక్షిణాఫ్రికా అద్భుతమే చేసింది. క్రమం తప్పకుండా ఇంగ్లాండ్ వికెట్లు తీసి ఆ జట్టుపై ఒత్తిడి పెంచింది. కళ్లు చెదిరే క్యాచ్ లు, సింగిల్స్ ను నిలువరిస్తూ.. ఇంగ్లాండ్ జట్టును 158 పరుగులకే పరిమితం చేసింది.
మరోసారి అలాంటి ప్రదర్శనే రిపీట్ చేయాలని పట్టుదలగా ఉంది. టోర్నీ సాగుతున్న కొద్దీ సౌతాఫ్రికా ఆట మెరుగవుతూ వచ్చింది. . బ్యాటింగ్‌లో తజ్మీన్ బ్రిట్స్ , లౌరా వాల్‌వార్ట్ కీలకం కానున్నారు. అయితే మిగతా బ్యాటర్లు విఫలం కావడం జట్టు బలహీనతను చూపిస్తోంది. దీనిని ఫైనల్లో ఎలా అధిగమిస్తారనే దానిపైనే సౌతాఫ్రికా విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. బౌలింగ్‌లో ఖాకా, మరిజాన్ కాప్ పై అంచనాలున్నాయి. ఇక గత రికార్డుల పరంగా సౌతాఫ్రికాపై ఆసీస్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటి వరకూ ఇరు జట్లూ ఆరు మ్యాచ్‌లలో తలపడితే అన్నిసార్లూ కంగారూ జట్టే గెలిచింది.