Australia vs Sri Lanka: స్టోయినిస్ విధ్వంసం.. లంకపై ఆసీస్ విజయం

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా బోణీ కొట్టింది.

  • Written By:
  • Publish Date - October 25, 2022 / 08:38 PM IST

టీ ట్వంటీ వరల్డ్ కప్ లో ఆతిథ్య ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. తొలి మ్యాచ్ లో కివీస్ పై చిత్తుగా ఓడిన ఆ జట్టు తాజాగా శ్రీలంకపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆల్ రౌండర్ స్టోయినిస్ విధ్వంసం హైలైట్ గా నిలిచింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లంక 157 పరుగులు చేసింది. మ్యాచ్ లో లంక తడబడి నిలబడింది. ఆరంభంలో పెద్దగా స్కోర్ చేయలేక పోయిన ఆ జట్టు చివర్లో మాత్రం ధాటిగా ఆడింది.

పిచ్ నుంచి లభించిన సహకారంతో ఆసీస్ బౌలర్లు చెలరేగగా..లంక బ్యాటర్లు తడబడ్డారు. తొలి 10 ఓవర్లలో ఆ జట్టు వికెట్ నష్టానికి 63 పరుగులు చేసింది. చివర్లో చరిత్ అసలంక ధాటిగా ఆడటంతో శ్రీలంక 150 పరుగుల మార్క్ అందుకుంది. ముఖ్యంగా కమిన్స్ వేసిన చివరి ఓవర్‌లో అసలంక 20 పరుగులు రాబట్టాడు.నిస్సంక 45 బంతుల్లో 2 ఫోర్లతో 40 , అసలంక 25 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 38 నాటౌట్ రాణించారు. లక్ష్య చేదనలో ఆస్ట్రేలియా త్వరగానే ఓపెనర్ డేవిడ్ వార్నర్ వికెట్ చేజార్చుకుంది. వార్నర్ 11 రన్స్ కే ఔటయ్యాడు.

మిచెల్ మార్ష్, మాక్స్ వెల్ ధాటిగా ఆడినప్పటికే ఎక్కువసేపు క్రీజులో నిలువలేకపోయారు. అయితే ఆల్ రౌండర్ స్టోయినిస్ రాకతో మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. క్రీజులోకి వచ్చీ రావడంతోనే భారీ షాట్లతో రెచ్చిపోయాడు. ఈ క్రమంలో టీ ట్వంటీల్లో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ చేసిన ఆస్ట్రేలియా క్రికెటర్ గా రికార్డు సృష్టించాడు. స్టోయినిస్ కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా గతంలో మాక్స్ వెల్ 18 బంతుల్లో హాఫ్ సెంచరీ రికార్డును బ్రేక్ చేశాడు. స్టోయినిస్ విధ్వంసంతో ఆస్ట్రేలియా 16.3 ఓవర్లలో టార్గెట్ ఫినిష్ చేసింది. స్టోయినిస్ 18 బంతుల్లో 4 ఫోర్లు , 6 సిక్సర్లతో 59 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. కెప్టెన్ ఫించ్ 31 రన్స్ చేశాడు. ఆస్ట్రేలియా తర్వాతి మ్యాచ్ లో శుక్రవారం ఇంగ్లాండ్ తో తలపడుతుంది.