వన్డే ప్రపంచ కప్ (World Cup 2023) లో భారత్ ప్రత్యర్థి ఎవరో తేలిపోయింది. టైటిల్ ఫేవరెట్ ఆస్ట్రేలియా (Australia ) ఫైనల్ కు చేరుకుంది. ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీస్ లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) 49.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. డేవిడ్ మిల్లర్ ఒక్కడే సెంచరీతో చెలరేగగా.. హెన్రీచ్ క్లాసెన్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. మిగిలిన బ్యాటర్లు విఫలమయ్యారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ మూడేసి వికెట్లు తీయగా.. జోష్ హజెల్ వుడ్, ట్రావిస్ హెడ్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
టార్గెట్ భారీగా లేకున్నా ఆసీస్ కు ఓపెనర్లు మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. తొలి వికెట్ కు 6.1 ఓవర్లలో 61 పరుగులు జోడించారు. దీంతో కంగారూ టీమ్ ఈజీగా గెలుస్తుందని అంతా భావించారు. అయితే స్పిన్నర్ల ఎంట్రీతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది.తొలుత దూకుడుగా ఆడిన ఆసీస్.. క్రమంగా వికెట్లు కోల్పోవడంతో మ్యాచ్ ఉత్కంఠభరితంగా మారింది. మార్ష్ , వార్నర్ , హెడ్ ఔట్ అయ్యాక ఆసీస్ ఒత్తిడిలో పడింది. లబుషేన్, మ్యాక్స్‌వెల్‌లను షంసీ ఔట్ చేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. జిడ్డుగా బ్యాటింగ్ చేసిన స్మిత్.. చివరకు చెత్త షాట్‌తో వెనుదిరిగాడు. అయితే జోష్ ఇంగ్లీస్ జట్టును విజయం వైపు నడిపించే ప్రయత్నం చేశాడు. సింగిల్స్ తీస్తూ జట్టును విజయానికి చేరువ చేశాడు. అతను చివర్లో ఔట్ అయినా.. కమ్మిన్స్, స్టార్క్ ఆసీస్ విజయాన్ని పూర్తి చేశారు.
ఒత్తిడిని తట్టుకుంటూ ఆస్ట్రేలియా 47.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ ఫైనల్‌కు రావడం ఇది ఎనిమిదోసారి. 1987, 1999, 2003, 2007, 2015లో ఛాంపియన్‌గా నిలిచింది. 1975, 1996లో రన్నరప్‌తో సరిపెట్టుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్లో ఓడిపోవడం ఇది ఐదోసారి. 1992, 1996, 2007, 2015లోనూ సఫారీలు సెమీస్లో ఓడిపోయారు. దీంతో ఆదివారం జరగనున్న ఫైనల్లో భారత్తో ఆస్ట్రేలియా తలపడనుంది.