Ashwin Reacts: స్మిత్ కామెంట్స్ కు అశ్విన్ కౌంటర్

స్టీవ్ స్మిత్ ఇక్కడి పిచ్ లపై కామెంట్స్ చేశాడు. ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదనడానికి ఓ వింత కారణం చెప్పాడు.

  • Written By:
  • Publish Date - February 4, 2023 / 05:02 PM IST

వరల్డ్ క్రికెట్ లో స్లెడ్జింగ్ కు కేరాఫ్ అడ్రస్ ఆస్ట్రేలియా…ప్రత్యర్థిపై ఆధిపత్యం కనబరిచేందుకు మాటలను కూడా ఆయుధంగా వాడుతుంటారు. ఏదైనా సీరీస్ ఆరంభానికి ముందు ప్రత్యర్ధి జట్టును మానసికంగా దెబ్బ కొట్టేందుకు మాటలతో కవ్విస్తుంటారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత టూర్ కు వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్ళు మాటల యుద్ధం మొదలు పెట్టారు. ఆ జట్టు ఆటగాడు స్టీవ్ స్మిత్ ఇక్కడి పిచ్ లపై కామెంట్స్ చేశాడు. సీరీస్ ఆరంభానికి ముందు ఎందుకు ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటం లేదనడానికి ఓ వింత కారణం చెప్పాడు. గత పర్యటనలో తమకు పేస్ పిచ్ పై ప్రాక్టీస్ మ్యాచ్ ఏర్పాటు చేశారని, అసలు మ్యాచ్ లలో ఉండే పిచ్ లకు సంబంధం లేకుండా ఉందని, అందుకే తాము ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకుండా తమ సొంతంగా స్పిన్ పిచ్ లపై ప్రాక్టీస్ చేస్తున్నట్లు స్మిత్ చెప్పాడు.

అయితే దీనికి తాజాగా స్పిన్నర్ అశ్విన్ కౌంటర్ ఇచ్చాడు. ప్రాక్టీస్ మ్యాచ్ ఆడకపోవడం ఆ జట్టుకు కొత్తేమీ కాదన్నాడు. ఇండియా కూడా కొన్ని విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు టూర్ గేమ్స్ ఆడదనీ, అంతర్జాతీయ షెడ్యూల్ చాలా బిజీగా ఉండటం వల్ల ఇలా జరుగుతుందన్నాడు. ప్రాక్టీస్ మ్యాచ్ కోసం పచ్చిక ఉన్న పిచ్ ఇచ్చారని స్మిత్ అన్నాడు. నిజానికి పుణెలో చాలా టర్న్ ఉన్న పిచ్ అది. వాళ్లకు పచ్చిక ఉన్న పిచ్ ఇచ్చి ఉండొచ్చనీ దానికోసం ఎవరూ ప్రత్యేకంగా ప్లాన్ చేయరనీ ఆశ్విన్ చెప్పుకొచ్చాడు.

అయినా ఓ సిరీస్ కు ముందు ఆస్ట్రేలియాకు ఇలా మైండ్ గేమ్స్ ఆడటం, స్లెడ్జింగ్ చేయడం అలవాటనీ కౌంటర్ ఇచ్చాడు. వాళ్లు దానిని ఇష్టపడతారన్న అశ్విన్ అది వాళ్ల క్రికెట్ ఆడే స్టైల్ అన్నాడు. ఇదిలా ఉంటే నాలుగు టెస్టుల సిరీస్ కోసం ఇరు జట్లు నెట్ ప్రాక్టీస్ లో బిజీగా ఉన్నాయి. ఆస్ట్రేలియాపై మరోసారి ఆధిపత్యం కనబరిచేందుకు టీమిండియా క్రికెటర్లు చెమటోడ్చుతున్నారు. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌లో తొలి టెస్ట్‌ మ్యాచ్ఈ నెల 9 నుంచి నాగ్‌పూర్‌లో జరగనుంది వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షిప్ ఫైనల్‌ చేరాలంటే భారత్‌కు ఇదే చివరి అవకాశం.