Women WC: ఆస్ట్రేలియాదే మహిళల వన్డే ప్రపంచ కప్

మహిళల ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఏడో సారి కైవసం చేసుకుంది. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.

  • Written By:
  • Publish Date - April 3, 2022 / 04:01 PM IST

మహిళల ప్రపంచకప్ ను ఆస్ట్రేలియా ఏడో సారి కైవసం చేసుకుంది. క్రిస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఫైనల్ లో ఆస్ట్రేలియా 71 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ ను ఓడించింది.
డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్.. ఆరు సార్లు ఛాంపియన్ ఆసీస్ మధ్య ముగిసిన ప్రపంచకప్ ఫైనల్ అభిమానులను అసలైన క్రికెట్ మజాను పంచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 356 పరుగులు చేసింది. ఓపెనర్లు అలిస్సా హేలీ 170, హేన్స్ 68,మూనీ 62 పరుగులతో రాణించారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ నుంచే ఇంగ్లాండ్ బౌలర్ల పనిపట్టిన హేలీ-హేన్స్ లు తొలి వికెట్ కు 160 పరుగులు జోడించింది. హేన్స్ నిష్క్రమించినా.. ఆమె స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన బెత్ మూనీ సాయంతో హేలీ చెలరేగిపోయింది. ఫైనల్ మ్యాచులో అద్భుత సెంచరీతో కదం తొక్కిన హేలీ.. అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్ గా రికార్డు సృష్టించింది.

భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ కు ఆదిలోనే షాక్ లు తగిలాయి. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఆ జట్టు స్టార్ బ్యాటర్ వ్యాట్ ఔటవగా.. బీమౌంట్ తో పాటు కెప్టెన్ హెదర్ నైట్ కూడా త్వరగానే నిష్క్రమించారు. దీంతో ఆ జట్టు 86 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది.ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన నటాలీ సీవర్ 121 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్సర్ తో 148 రన్స్ తో ఒంటరిపోరాటం చేసింది. మిగతా ఇంగ్లాండ్ బ్యాటర్లంతా పెవిలియన్ కు క్యూ కట్టినా దాసోహమవుతుంటే.. సీవర్ మాత్రం చివరి వరకూ పోరాడింది. అయితే ఆమెకు సహకారం అందించేవారు లేకపోవడంతో ఇంగ్లాండ్ కు ఓటమి తప్పలేదు. దీంతో ఇంగ్లాండ్ 285 పరగులకు ఆలౌట్ అవగా…ఆస్ట్రేలియా ఏడో సారి వరల్డ్ కప్ గెలుచుకుంది.